Andhra News: శభాష్‌ పోలీస్‌.. ఇది కదరా అసలైన సేవ అంటే.. 24 గంటల్లోనే సమస్య పరిష్కారం

ఆమె వయస్సు 80 ఏళ్ళు.. భర్త చనిపోయి ఒంటరిగా ఉంటోంది.. కొడుకు, మనవడు ఉన్నాడు.. ఆ వయస్సులో ఆమెను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఈ ఇద్దరే ఆమె పాలిట యముళ్లలా మారారు. ఆమె పేరుతో ఉన్న 4 ఎకరాల పొలాన్ని కౌలుకు ఇచ్చి ఆ డబ్బులు కాజేయడమే కాకుండా ఆమెను నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది.

Andhra News: శభాష్‌ పోలీస్‌.. ఇది కదరా అసలైన సేవ అంటే.. 24 గంటల్లోనే సమస్య పరిష్కారం
Andhra News

Edited By: Anand T

Updated on: Nov 19, 2025 | 2:52 PM

ప్రకాశంజిల్లా కొనకనమిట్ల మండలం నాగంపల్లికి చెందిన బాధితురాలు బూదాల మాణిక్యం తనకు న్యాయం చేయాలని, కొడుకు – మనవడి నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంటూ జిల్లా ఎస్‌పి హర్షవర్ధన్‌రాజును ఆశ్రయించి తన సమస్యను చెప్పుకుంది. 80 ఏళ్ళ పండు ముదుసలి మాణిక్యం ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చలించిపోయిన ఎస్‌పి వృద్ధురాలికి తక్షణమే భద్రత కల్పించాలని, ఆర్థిక వివాదాన్ని పరిష్కరించి, కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ పొదిలి సీఐ రాజేష్ కుమార్‌ను ఆదేశించారు. ఎస్‌పి ఆదేశాలతో ఆఘమేఘాలపై నాగంపల్లికి వెళ్ళిన సిఐ రాజేష్‌, బాధిత వృద్దురాలు మాణిక్యంను కలిసి సమస్యను తెలుసుకున్నారు.. తన మనవడు కొట్టాడని, తన డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదని తన సమస్యలను సిఐ రాజేష్‌కు తెలిపారు.

వృద్దురాలిపై ఆమె మనవడు బూదాల మెస్సీ మెషాక్ దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు తెలుసుకుని, అతడిని గట్టిగా మందలించారు పోలీసులు.. ఇలాంటి ప్రవర్తన పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాణిక్యం వయసు ఎక్కువగా ఉన్నందున సీనియర్ సిటిజన్ రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుని చట్ట ప్రకారం కొడుకైనా, మనవడైనా చర్యలు తీసుకొంటామని కౌన్సిలింగ్ చేశారు. మాణిక్యం పేరు మీద 4 ఎకరాలు భూమి ఉన్నందున, ఆమె బ్రతుకుదెరువుకోసం ఆమెకి నచ్చిన వారికి కౌలుకి ఇచ్చుకొనే అధికారం ఆమెకే ఉందని, ఈ విషయం లో ఆమె కొడుకు బుడాల శాంసన్, మనవడు బూదాల మెస్సీ అనవసరంగా జోక్యం చేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు.

వృద్ధురాలైన మాణిక్యం సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆమె స్వగ్రామమైన నాగంపల్లిలో ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద ఇల్లు కల్పించే విషయంపై కొనకనమిట్ల మండల తహశీల్దార్ తో పొదిలి సీఐ మాట్లాడారు. వృద్ధురాలు నివసించేందుకు త్వరలో ఒక ఇంటిని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకునేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నారు. వృద్దురాలి సమస్యపై వెంటనే స్పందించి కేవలం 24 గంటల్లోపే జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఆదేశాలతో కుటుంబ కలహాలు, ఆర్థిక వివాదం పరిష్కారమయ్యాయి. వృద్ధురాలి సమస్యను మానవతా దృక్పథంతో తక్షణమే పరిష్కరించిన పోలీసులకు వృద్దురాలు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.