Andhra: వార్డెన్‌పై దాడి చేసి జైలు నుంచి తప్పించుకున్నారు.. కట్ చేస్తే.. వైజాగ్ రైల్వే స్టేషన్‌లో..

ఆంధ్రప్రదేశ్.. అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు నుంచి పరారైన ఇద్దరు ఖైదీలు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. విశాఖపట్నం సిటీలోనే ఇద్దరు ఖైదీలను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. విశాఖ రైల్వే స్టేషన్‌ నుంచి తిరుపతి వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Andhra: వార్డెన్‌పై దాడి చేసి జైలు నుంచి తప్పించుకున్నారు.. కట్ చేస్తే.. వైజాగ్ రైల్వే స్టేషన్‌లో..
Crime News

Updated on: Sep 07, 2025 | 8:34 AM

అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న ఇద్దరు నిందితులు వార్డర్‌పై దాడి చేసి, పారిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బెజవాడ రాము, నక్కా రవికుమార్ అనే ఇద్దరు రిమాండ్‌ ఖైదీలు.. అనకాపల్లి జిల్లా చోడవరం సబ్‌ జైలు వార్డర్‌పై దాడి చేసి పరారయ్యారు. దీంతో.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన అనకాపల్లి పోలీసులు.. విశాఖ, విజయనగరం, అల్లూరి జిల్లాల పోలీసులను అలర్ట్‌ చేసి గాలింపు నిర్వహించారు. పరారైన ఇద్దరు ఖైదీల ఫొటోలతో ప్రకటన కూడా విడుదల చేశారు. వారి ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే.. రాము, రవికుమార్‌.. విశాఖ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కారు. విశాఖ రైల్వే స్టేషన్‌ నుంచి తిరుపతి వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు.

విశాఖపట్నం సిటీలోని ఓ వ్యక్తి డబ్బులు ఇవ్వాల్సి ఉండగా.. వసూలు చేసుకునేందుకు ఇద్దరు ఖైదీలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో.. ఇద్దర్నీ అరెస్ట్‌ చేసి.. చోడవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇప్పటికే.. నక్కా రవికుమార్.. పెన్షన్ డబ్బులు కాజేసిన కేసులో నిందితుడి కాగా.. బెజవాడ రాము.. ఓ చోరీ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా మరికొన్ని కేసులు నమోదు కావడంతో కోర్టులో హాజరుపర్చనున్నారు చోడవరం పోలీసులు..

కాగా.. రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న రాము, రవికుమార్.. చోడవరం సబ్‌ జైలు వార్డర్‌పై దాడి చేసి పరారయ్యారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్‌ అయ్యాయి. తనపై దాడి జరుగుతున్నా.. ఆ ఖైదీలు తప్పించుకోకుండా సబ్‌జైలు వార్డర్‌ తీవ్రంగా పోరాడారు. అయినప్పటికీ.. బెజవాడ రాము.. సుత్తితో దాడి చేయగా.. నక్కా రవికుమార్‌.. వార్డర్‌ దగ్గర తాళాలు తీసుకుని.. షెట్టర్ల లాక్‌ తీసి పరారవడం తీవ్ర కలకలం రేపింది.

వీడియో చూడండి..

దీంతో అలర్ట్‌ అయిన అనకాపల్లి పోలీసులు.. చుట్టుపక్కల జిల్లాలను అప్రమత్తం చేయడంతో విశాఖ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు 24గంటల్లోపే బుక్కయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..