
ఉండవల్లి గుహల నిర్మాణం క్రీ.శ 5వ నుండి 7వ శతాబ్దాల మధ్యకాలానికి చెందినదిగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ కాలంలో ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన విష్ణుకుండినులు కళా, సాంస్కృతిక అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇచ్చారు. మొదట ఈ గుహలు బౌద్ధ సాధనకు కేంద్రాలుగా ఉండి.. తరువాత కాలంలో హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా మారాయి. ఇది ఆ కాలంలో మతపరమైన మార్పులు ఎలా చోటు చేసుకున్నాయో తెలియజేసే ముఖ్యమైన ఉదాహరణ. గుహల గోడలపై కనిపించే శిల్పాలు, నిర్మాణ శైలులు ఆ కాలపు జీవన విధానం, విశ్వాసాలు, కళా నైపుణ్యాన్ని మన ముందుకు తెస్తాయి.
ఈ నిర్మాణం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఒకే రాతి కొండను త్రవ్వి నాలుగు అంతస్తులుగా నిర్మించడం ఆ కాలంలో ఉన్న శిల్పుల ప్రతిభకు నిదర్శనం. ప్రతి అంతస్తులో విశాలమైన మందిరాలు అందంగా చెక్కిన స్తంభాలు విభిన్న దేవతామూర్తుల శిల్పాలు బౌద్ధ, జైన, హిందూ సంప్రదాయాల మేళవింపు. ఇవి అన్నీ కలిపి ఈ గుహలను ఒక జీవంత కళాభండాగారంగా నిలబెట్టాయి. శిల్పాల్లోని సూక్ష్మత, ఆకృతుల సమతుల్యత, నిర్మాణంలో ఉన్న ఖచ్చితత్వం ఈ గుహలను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఉండవల్లి గుహలకు ప్రధాన ఆకర్షణగా నిలిచేది శ్రీ అనంత పద్మనాభస్వామి విగ్రహం. సుమారు 20 అడుగుల పొడవుతో, ఒకే రాతి శిలను చెక్కి రూపొందించిన ఈ శయన రూప విగ్రహం భక్తులను, పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ విగ్రహం కేవలం ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా, శిల్పకళలో ఉన్న అద్భుత నైపుణ్యానికి కూడా ప్రతీక. ఇలాంటి భారీ విగ్రహాన్ని ఒకే రాతితో నిర్మించడం ఆ కాలంలో ఎంతటి సాంకేతిక పరిజ్ఞానం ఉందో తెలియజేస్తుంది..
ఈ గుహల చుట్టూ విస్తరించి ఉన్న పచ్చని పంట పొలాలు, సమీపంలో ప్రవహించే కృష్ణా నది ఈ ప్రాంతానికి మరింత అందాన్ని తెస్తాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో ఈ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తుంది. ప్రకృతి మధ్యలో కొంతసేపు గడపాలనుకునే వారికి ఫోటోగ్రఫీ ప్రేమికులకు, కుటుంబ సమేతంగా వెళ్లే వారికి ఇది ఒక ఉత్తమ ప్రదేశం. ఉండవల్లి గృహాలు విజయవాడకు సమీపంలోనే ఉన్నాయి. ప్రకాశం బ్యారేజి దాటి మంగళగిరి వైపు వెళ్లి, అమరావతి రోడ్డులో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఈ గుహలు ఉన్నాయి. రోడ్డు మార్గం సౌకర్యవంతంగా ఉండటం వల్ల సులభంగా చేరుకోవచ్చు. ఇంకా అభివృద్ధి అవసరం. ఇప్పటికే పర్యాటకులను ఆకర్షిస్తున్నప్పటికీ, ఉండవల్లి గుహలకు మరింత అభివృద్ధి అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మెరుగైన రోడ్డు సదుపాయాలు గైడ్ సేవలు , లైటింగ్ , భద్రతా ఏర్పాట్లు ప్రచార కార్యక్రమాలు అమలు చేస్తే ఈ ప్రదేశం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉంది.. ఉండవల్లి గుహలు కేవలం ఒక పర్యాటక స్థలం మాత్రమే కాదు. అవి మన చరిత్రను సంస్కృతిని, కళను ప్రతిబింబించే అమూల్య వారసత్వం. ఒకసారి వెళ్లి చూస్తే ఆ కాలపు శిల్పుల ప్రతిభకు మనసారా నమస్కరించకుండా ఉండలేం.