
ఒకవైపు బంగారం ధరలు ఆల్‌టైం రికార్డులు సృష్టిస్తుంటే మరో వైపు ఓ తులం బంగారం చోరీ చేసినా చాలు అన్నట్టుగా తయారయ్యారు కొంతమంది దొంగలు. ఈ నేపధ్యంలోనే ఒంగోలులో దారుణం జరిగింది. నగరంలోని మంగమూరుడొంకలోని ఓ కిరాణాషాపు యజమానురాలిపై కొనుగోలు చేసేందుకు వచ్చినట్టు నటిస్తూ ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఆమె మెడలోని బంగారు తాళిబొట్టుదారాన్ని లాక్కున్నాడు. ఈ పెనుగులాటలో మహిళ మెడ, చేతిపై కత్తిగాయాలయ్యాయి… అనంతరం తేరుకున్న బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు వెంటాడి పారిపోతున్న నిందితుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
అసలేం జరిగిందంటే…
ఒంగోలు నగరంలోని మంగమూరురోడ్డులోని ప్రధాన రహదారి జనంతో సందడిగా ఉంది. మధ్యాహ్నం రెండు గంటలు కావస్తోంది. మెయిన్ బజారులోని విజయ ఎంటర్‌ప్రైజెస్ ఫ్యాన్సీ దుకాణంలో యజమానురాలు మునగాల భవాని ఎప్పటిలాగే వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది… ఇంతలో ఓ వినియోగదారుడు వచ్చాడు… చింపిరి జుత్తు, మాసిన బట్టలతో వింతగా ఉన్నాడు… తనకు రోల్డ్‌గోల్డ్ బ్రాస్‌లెట్ కావాలని అడిగాడు… అందుకు కొన్ని మోడల్స్ చూపించింది షాపు యజమానురాలు భవానీ… అయితే అవి తనకు నచ్చలేదని ఆ యువకుడు వెళ్లిపోయాడు… మళ్లీ తిరిగి వచ్చి తనకు ఓ మోడల్ నచ్చిందంటూ బేరం మొదలుపెట్టాడు… బేరసారాలు కొనసాగుతుండగానే హఠాత్తుగా కత్తితీసి ఆమె గొంతుపై పెట్టి మెడలోని బంగారు తాళిబొట్టుదారం లాగేందుకు ప్రయత్నించాడు. ఈ పరిణామంతో తీవ్రంగా భయపడిపోయిన భవానీకి ముచ్చెమటలు పోశాయి. కత్తి గొంతుపై ఉన్నా ధైర్యంతో ప్రతిఘటించింది… కత్తిని తన చేత్తో పట్టుకుని యువకుడ్ని నిలువరించింది… ఈ పెనుగులాటలో భవానీ మెడపై, చేతులపై కత్తిగాయాలు అయ్యాయి… పెనుగులాటలోనే ఆ యువకుడు భవానీ మెడలోని బంగారు తాళిబొట్టు దారం లాక్కొని పరుగు పెట్టాడు… తీవ్ర షాక్‌లో ఉన్న భవానీ తేరుకుని కేకలు వేయడంతో పారిపోతున్న యువకుడ్ని స్థానికులు పట్టుకున్నారు… పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు… పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు… వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులకు నిందితుడ్ని అప్పగించారు… పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు… మధ్యాహ్నం జనసమ్మర్ధమైన ప్రాంతంలో షాపు యజమానురాలి మెడలోనుంచి బంగారు తాళిబొట్టుదారాన్ని దొంగ లాక్కెళ్ళుందుకు ప్రయత్నించడం స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.