Andhra: మురసు తుఫాన్ తీరం దాటగానే.. బంగారం కోసం వేట..

దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో మురసు తుఫాను తీరం దాటింది. ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద తెల్లవారుజామున తీరం దాటిన ఈ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. అయితే, తీవ్రత గత తుఫానులతో పోలిస్తే తక్కువగా ఉంది. తుఫాను తర్వాత బంగారు వస్తువులు ఏవైనా కొట్టుకొచ్చి ఉంటాయనే ఆశతో స్థానికులు కొత్తపట్నం బీచ్‌లో వెతుకుతున్నారు.

Andhra: మురసు తుఫాన్ తీరం దాటగానే.. బంగారం కోసం వేట..
Kothapatnam Beach Gold Search

Updated on: Nov 03, 2026 | 2:58 PM

దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని మురసు తుఫాను దాటింది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలుకు సమీపంలో ఉన్న కొత్తపట్నం వద్ద ఈ తుఫాను తీరాన్ని దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాయి. తెల్లవారుజామున 3:30 గంటల నుంచి 5:30 గంటల మధ్య తుఫాను ప్రక్రియ పూర్తైందని అధికారులు తెలిపారు. మురసు తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 100 కిలోమీటర్ల నుంచి 120, ఒక్కోసారి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. అయితే ఇటీవల కలకలం రేపిన అర్నబ్ తుఫానుతో పోలిస్తే మురసు తీవ్రత తక్కువగా ఉందని, కరెంటు స్తంభాలు, చెట్లు పడిపోవడం వంటి సంఘటనలు తక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఈ తుఫాను ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమతో పాటు తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలపై పాక్షికంగా కనిపించింది. తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి.

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం, సోమవారం ఉదయం 8:30 నుంచి మంగళవారం ఉదయం 6 గంటల మధ్య అత్యధిక వర్షపాతం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో 198 మిల్లీమీటర్లు నమోదైంది. కొత్తపట్నంలో 182 మిల్లీమీటర్లు, బాపట్లలో 128 మిల్లీమీటర్లు, చీరాలలో 124 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. తీర ప్రాంత ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉన్నారు. తుఫాను తీరం దాటడానికి ముందే మత్స్యకారులు తమ పడవలను పైకి లాగి భద్రపరుచుకున్నారు. తమ వలలను కూడా మూటకట్టి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, తుఫాను తీవ్రతకు కొన్ని పడవలు దెబ్బతిన్నాయి.

తుఫాను తీరం దాటి బలహీనపడిన తర్వాత కొత్తపట్నం బీచ్‌లో ఒక వింత, ఆసక్తికర దృశ్యం కనిపించింది. సాధారణంగా వీకెండ్‌లలో పర్యాటకులతో కిటకిటలాడే ఈ బీచ్, తుఫాను కారణంగా ఖాళీగా ఉండాలి. అయితే, అనేక మంది స్థానికులు బీచ్‌లో గుమిగూడారు. తుఫానుల సమయంలో సముద్రపు అలలు విలువైన వస్తువులను, ముఖ్యంగా బంగారు ఆభరణాలను తీరానికి కొట్టుకువస్తాయనే నమ్మకంతో వీరు బంగారం కోసం వెతుకుతున్నారు. పర్యాటకులు సముద్రంలో స్నానం చేసేటప్పుడు పోగొట్టుకున్న ఆభరణాలు అలల తాకిడికి ఒడ్డుకు కొట్టుకువస్తాయని స్థానికులు నమ్ముతారు. గతంలో కూడా కొందరు స్థానిక మత్స్యకారులకు గాజులు, ఉంగరాలు వంటి బంగారు వస్తువులు దొరికినట్లు వారు పేర్కొన్నారు. వర్షంలో తడుస్తూ కూడా స్థానికులు బీచ్ పొడవునా వెతుకుతూ కనిపించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us