అర్నబ్ తుఫాన్ ప్రభావం ఏ ప్రాంతంపై ఎక్కువ ఉండబోతుంది..? తెలంగాణలో కూడా వర్షాలు ఉంటాయా..?

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అర్నబ్ తుఫాన్.. అక్టోబర్ 28న బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

అర్నబ్ తుఫాన్ ప్రభావం ఏ ప్రాంతంపై ఎక్కువ ఉండబోతుంది..? తెలంగాణలో కూడా వర్షాలు ఉంటాయా..?
Weather Update

Updated on: Oct 26, 2026 | 3:49 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం అర్నబ్ తుఫానుగా బలపడి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నివేదికల ప్రకారం, ఈ తుఫాను అక్టోబర్ 26 అర్ధరాత్రి సమయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారనుంది. అక్టోబర్ 27న మరింత బలపడి అతి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతుందని అంచనా. అనంతరం ఇది వాయువ్య దిశగా కదులుతూ అక్టోబర్ 28న ఉదయం బాపట్ల, విశాఖపట్నం మధ్య అతి తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉంది.

తీరం దాటే సమయంలో గాలి వేగం, వర్షపాతం

అర్నబ్ తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో భారీ గాలులు వీచే అవకాశం ఉందని, కొన్ని సమయాల్లో గాలి వేగం గంటకు 140 కిలోమీటర్ల వరకు పెరగొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ బలమైన గాలుల కారణంగా తీరప్రాంతాల్లోని నిర్మాణాలు, చెట్లకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం నెలకొనగా, కొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. అయితే, తుఫాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు సూచిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు

తుఫాను తీరం దాటే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలపై తీవ్ర ప్రభావం పడనుంది. అక్టోబర్ 27న తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాలకు అతి భారీ వర్షాల నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేయబడింది. ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అలాగే, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన ఉంది. పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో యెల్లో అలర్ట్ జారీ చేయగా, ఈ ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అక్టోబర్ 28న తుఫాను తీరం దాటే సమయంలో అల్లూరి సీతారామరాజు నుండి కృష్ణా, గుంటూరు జిల్లాల వరకు విస్తరించి ఉన్న తీరప్రాంత జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచి, తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

జాగ్రత్త చర్యలు, హెచ్చరికలు

తుఫాను నేపథ్యంలో అధికారులు విస్తృతమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారులను సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని కఠినంగా హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ళ నుండి బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయి.

తెలంగాణపై ప్రభావం

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పొడి వాతావరణం నెలకొంది. అయితే, అక్టోబర్ 28న తుఫాను తీరం దాటిన తర్వాత కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ వంటి కొన్ని జిల్లాల్లో మేఘావృత వాతావరణంతో పాటు మోస్తరు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. తెలంగాణకు భారీ వర్ష సూచన లేదా రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు ఏమీ లేవు. ప్రధానంగా అర్నబ్ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పైనే తీవ్రంగా ఉండనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us