CM Jagan: అక్టోబరు 1 నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకం అమలు చేయనుంది జగన్ సర్కార్. దీంతో ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 98.44 శాతం అమలు చేయబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించి జీవో జారీ చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన కార్మికుల కుటుంబాలకు ఈ పథకం వర్తింపు చేస్తున్నట్లు తెలిపింది. పేద ఆడపిల్లల కుటుంబాలకు సర్కారు బాసటగా నిలిచేందుకు.. వారికి అండగా ఉండేందుకు ఈ పథకం అమలు చేస్తున్నట్లు పేర్కొంది. కళ్యాణమస్తు, షాదీ తోఫాల కింద గత ప్రభుత్వం ప్రకటించిన దానికంటే అధికంగా నగదు సాయం చేయనుంది జగన్ సర్కార్. ఎస్సీలకు వైఎస్సార్ కళ్యాణమస్తు కింద లక్ష రూపాయలు అందజేయనుంది. ఎస్సీల కులాంత వివాహాలకు రూ. 1.2 లక్షలు ఇవ్వనుంది. ఎస్టీలకు రూ. 1 లక్ష సాయం చేయనుంది. ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు ఇవ్వనుంది. బీసీలకు రూ. 50వేలు.. వారు కులాంతర వివాహాలు చేసుకుంటే రూ.75వేలు సాయం చేయనుంది. మైనార్టీలకు రూ. 1 లక్ష సాయం అందించనుంది. వికలాంగుల వివాహాలకు రూ. 1.5 లక్షలు సాయం చేయబోతున్నట్లు తెలిపింది. భవన నిర్మాణ కార్మికులకు రూ.40వేలు ఇవ్వనన్నట్లు తెలిపింది. అమ్మాయి వయస్సు 18 సంవత్సరాలు, అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలు దాటాలనే నిబంధనను జీవోలో పొందుపరిచింది ప్రభుత్వం. పథకానికి సంబంధించి పూర్తి వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పథకం నిర్వహణ ఉంటుందని స్పష్టం చేసింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి