Chandrababu: ఉత్తుత్తి బటన్‌ నొక్కడం తప్ప, రైతుల కష్టాలు పట్టవ్.. జగన్‌పై బాబు ఫైర్

వచ్చే ఎన్నికల్లో జగన్‌ పార్టీని రైతులు చిత్తు చిత్తుగా ఓడిస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బటన్‌ నొక్కడం వల్ల ప్రజాసమస్యలు తీరడం లేదని ఆరోపించారు. పల్నాడు జిల్లాలో వర్షానికి దెబ్బ తిన్న పంట పొలాలను చంద్రబాబు పరిశీలించారు.

Chandrababu: ఉత్తుత్తి బటన్‌ నొక్కడం తప్ప, రైతుల కష్టాలు పట్టవ్.. జగన్‌పై బాబు ఫైర్
Tdp Chief Nara Chandarbabu

Updated on: Oct 19, 2022 | 9:29 PM

ఇటీవల కురిసిన వర్షాలకు పల్నాడు జిల్లాలో దెబ్బతిన్న పంట పొలాలను TDP అధ్యక్షుడు చంద్రబాబు పరిశీలించారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, జిల్లా నాయకులతో కలిసి ఆయన చిలకలూరిపేట వచ్చారు.  నాదెండ్ల, తుబాడు, నరసరావుపేట, పిడుగురాళ్ల, దాచేపల్లి ప్రాంతాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంటను పరిశీలించారు. రైతులకు సాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు మండిపడ్డారు. అక్కడి రైతులతో మాట్లాడారు. తమకు ప్రభుత్వం నుంచి ఇన్‌పుట్‌ సబ్సిడీ అందడం లేదని కొందరు రైతులు చంద్రబాబుకు చెప్పారు.

సీఎం జగన్‌ నొక్కుతున్నది ఉత్తుత్తి బటన్‌ అని అది పనిచేయడం లేదని చంద్రబాబు ఆరోపించారు. 2024 లేదా అంతకంటే ముందే ఎన్నికలు వచ్చినా YCPని రైతులు చిత్తు చిత్తుగా ఓడించడం ఖాయమని చంద్రబాబు అన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి.. రైతుల మెడకు తాడు బిగించి లాగేందుకు సిద్ధంగా ఉన్నారని వైసీపీపై చంద్రబాబు ఫైరయ్యారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు. మిర్చికి ఎకరాకు రూ.50 వేలు, పత్తి రూ.30 వేలు చెల్లించాలన్నారు.  పంటల బీమా ఎందుకు ఇవ్వడం లేదో ప్రభుత్వం చెప్పలేదన్నారు.  ప్రీమియం చెల్లించకపోవడంతో రైతులు నష్టపోయారని  విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రైతులు ఆత్మహత్యలు పెరగాయని పేర్కొన్నారు. జగన్‌కు బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని బాబు పేర్కొన్నారు. >పవన్ కల్యాణ్‌కు విశాఖలో పర్యటించడం ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు. భూ కబ్జాలు బయటపడతాయన్నదే వారి భయమన్నారు.

మరో వైపు చంద్రబాబు పర్యటన సందర్భంగా తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరు బట్టబయలైంది. జొన్నలగడ్డలో పంట పొలాలు పరిశీలించే సమయంలో టీడీపీలోని రెండు వర్గాలు గొడవకు దిగాయి.