సత్యసాయిజిల్లా పెనుకొండలో తెలుగుదేశంపార్టీ నిర్వహించిన రా కదలిరా..రా బహిరంగ సభకు జనం భారీగా తరలివచ్చారు. వేలాది మంది పార్టీ కార్యకర్తలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. కియా పరిశ్రమకు అతీ సమీపంలో ఈ సభా వేదిక ఏర్పాటు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చంద్రబాబు తలపెట్టిన రా కదలిరా సభలో ఇదే చివరి సభ కావడంతో తెలుగు తమ్ముళ్లు పెద్దసంఖ్యలో జనసమీకరణ చేశారు. ఈ సభతో టీడీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపాయి. పార్టీ జెండాలతో పెనుగొండ పసుపు మయమైంది.
వచ్చే ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఈ ఐదేళ్లలో జగన్మోహన్‌రెడ్డి పెద్దయెత్తున అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. జగన్ స్కీమ్‌లన్నీ… స్కామ్‌ల కోసమేనని విమర్శించారు. జగన్ సిద్ధం..సిద్ధమని అంటున్నారు… ఓడిపోవడానికి సిద్ధమేనా? అని ప్రశ్నించారు చంద్రబాబునాయుడు. అటు టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ సైతం సీఎం జగన్ తీరుపై ఫైరయ్యారు.
సిద్ధమంటున్న జగన్ తాము అడిగే ప్రశ్నలకు సిద్ధమేనా అంటు ప్రశ్నించారు బాలయ్య. మొత్తానికి టీడీపీ తలపెట్టిన రా..కదలిరా సభలతో పార్టీలో ఫుల్ జోష్ వచ్చింది. దాంతో త్వరలో ప్రజాగళం పేరిట మలివిడత ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు శ్రీకారం చుట్టబోతున్నారు.