
అమరావతి, జులై 08:- బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ వసతిగృహాలు, గురుకులాల్లో చదువుతోన్న విద్యార్థులకు చెల్లించే డైట్ ఛార్జీలను 10 శాతం పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఇస్తున్న డైట్ ఛార్జీల్లో 10 శాతం పెంచాలని అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని.. వచ్చే ఏడాది నుంచి పెంచుదామని ఆర్థిక శాఖ అధికారులు సూచించినా.. ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచే డైట్ ఛార్జీల పెంపు వర్తింపజేయాలని సీఎం స్పష్టం చేశారు. బలహీనవర్గాల విద్యార్థుల కోసం డైట్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జీవితాల్లో విద్య ద్వారానే మార్పు వస్తుంది. దీనికి తగినట్టుగానే వారికి అన్ని రకాల అవకాశాలు కల్పించాలి. మెరుగైన విద్య, మౌళిక సదుపాయాలతో పాటు పౌష్టికాహారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ఈ మేరకే డైట్ ఛార్జీలు పెంచుతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు లబ్ది చేకూర్చే విషయంలో వారికి కలిగే ప్రయోజనాన్ని పరిగణనలోకి తీసుకోవాలి’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు
సంక్షేమ శాఖలకు చెందిన విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున గురుకులాల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ విద్యా సంస్థలను కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దాలని వ్యాఖ్యానించారు. హాస్టళ్ల స్థానంలో గురుకులాల నిర్మాణం చేపట్టేందుకు పెద్దపీట వేయాలని.. రెసిడెన్షియల్ స్కూళ్లల్లో నెట్‌జీరో విధానాన్ని అమలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో విశ్లేషించాలన్నారు. బయో డైవర్శిటీ పార్కుల తరహాలో గురుకులాలను నిర్వహించాలని.. మెరుగైన వసతులు, మౌళిక సదుపాయాలతో గురుకులాలను నిర్మించాలన్నారు.
అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్ల మెయింటెనెన్స్ గ్రాంట్ ఇవ్వాలని.. దీని నిమిత్తం రూ.100 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. హాస్టళ్లు, గురుకులాల్లో చదివే విద్యార్థులను ఉన్నత విద్య, పోటీ పరీక్షలకు ప్రిపేర్ చేసేలా చర్యలు తీసుకోవాలని.. ఐఐటీ, ఎన్ఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచేలా శిక్షణ ఇప్పించాలన్నారు. పోటీ పరీక్షలకు గురుకులాల్లో చదువుతోన్న విద్యార్థులను సిద్ధం చేయాలని.. విద్యతో సమానంగా శిక్షణ అందించాలన్నారు. బెస్ట్ టీచర్స్ నియమించి క్వాలిటీ ట్రైనింగివ్వాలని.. హాస్టళ్లు, గురుకులాల్లో చదువుకుంటూ ప్రతిభ కనబరిచే ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.
ఈ మేరకు పైలెట్ ప్రాజెక్టు కింద కొన్ని ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ప్రారంభించాలని.. ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలను మ్యాపింగ్ చేసి.. నైపుణ్యం పెంచి పారిశ్రామిక అవసరాలకు వర్క్‌ఫోర్స్ సిద్దం చేయాలన్నారు. హాస్టళ్లు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఓ వైద్య విభాగాన్ని ఏర్పాటు చేయాలని.. సంక్షేమ హాస్టళ్లను ఎన్ఆర్ఐలు అడాప్ట్ చేసుకునేలా వారితో సంప్రదింపులు జరపాలన్నారు. సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో పూర్వ విద్యార్థుల నెట్ వర్కింగ్ చేయాలని.. రెసిడెన్షిల్ స్కూళ్లు, గురుకులాల్లో స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి విద్యా, వైద్య సేవలు అందించే వాళ్లకి అవకాశం కల్పించాలని సీఎం సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.