Andhra Pradesh: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. రెండు కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి రిలీఫ్. రేణిగుంట మీదుగా రెండు కొత్త రైల్వే లైన్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇవి అందుబాటులోకి వస్తే శ్రీవారి భక్తులకు మరింత ప్రయోజనకరంగా ఉండనున్నాయి. తమిళనాడు నుంచి తిరుమలవకు వచ్చేవారికి కూడా ఉపయోగం కలగనుందని చెప్పవచ్చు.

Andhra Pradesh: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. రెండు కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..
Railway

Updated on: Sep 12, 2026 | 12:09 PM

ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రం గుండా పలు రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ముంబై-చెన్నై హైడెన్సిటీ కారిడార్ ఒకటి కాగా… రేణిగుంట-అరక్కోణం 3,4 లైన్ల విస్తరణ మరొకటిగా చెప్పవచ్చు. ముంబై-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్‌కు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. డీపీఆర్ కూడా సిద్దమవ్వగా.. త్వరలోనే భూసేకరణ పనులు మొదలుకానున్నాయి. భూసేకరణ తర్వాత టెండర్లను పిలిచి పనులను మొదలుపెట్టనున్నారు. ఈ కారిడార్ రేణిగుంట ఎయిర్‌పోర్ట్ మీదుగా వెళ్లనుంది. ముంబై నుంచి ఏపీ మీదుగా చెన్నై, కర్ణాటకలను కనెక్ట్ చేయనుంది. దీని వల్ల తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు కూడా ప్రయోజనం చేకూరనుంది.

కొత్త రైల్వే లైన్లు ఏర్పాటు

ఇక రేణిగుంట-అరక్కోణం కారిడార్‌ను 3,4 లైన్లుగా విస్తరించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రయాణానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పుడు ఈ ప్రాంతాల మధ్య 1,2 లైన్లు మాత్రమే ఉన్నాయి. కానీ 3,4 లైన్లుగా విస్తరణ చేపట్టడం వల్ల ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. రేణి గుంట నుంచి పుత్తూరు, నగరి, తిరుత్తణి మీదుగా అరక్కోణం వరకు స్టేషన్లు ఉంటాయి. కొత్త రైల్వే లైన్ల కోసం రూ.1936 కోట్లు ఖర్చు చేయనున్నారు. 2029-30 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఈ మార్గంలో 12 భారీ, 221 చిన్న బ్రిడ్జిలు ఉండనున్నాయి. ఈ రైల్వే లైన్లు పూర్తయితే తమిళనాడు నుంచి తిరుపతి వచ్చేవారికి ఉపయోగకరంగా ఉండనుంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే తమిళనాడు నుంచి విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వేగంగా వెళ్లవచ్చు.

అలాగే ఈ కొత్త రైల్వే లైన్లతో రాయలసీమ పవర్ ప్లాంట్, కుడ్గి ప్లాంట్‌లకు ఎన్నోర్ పోర్టు నుంచి బొగ్గు రవాణా చేయడానికి సహాయపడుతుంది. దీంతో పాటు ఆటోమొబైల్, సిడ్కో, సిమ్ కాట్, సిమెంట్ పరిశ్రమలకు ఉపయోగపడుతుంది. తమిళనాడు నుంచి రోజూ పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. తిరుమల శ్రీవారితో పాటు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి దేవాలయాలను కూడా దర్శించుకుంటారు. దీంతో వీటికి కూడా మెరుగైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. వీటి రాకతో ఉమ్మడి చిత్తూరు జిల్లా పెద్ద లాజిస్ట్రిక్స్ హబ్‌గా కూడా మారనుంది. ఇప్పటికే చిత్తూరు మీదుగా బుల్లెట్ ట్రైన్లను ప్రతిపాదించారు. ఇప్పుడు ఈ కొత్త రైల్వే లైన్ల రాకతో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యంతో పాటు లాజిస్ట్రిక్స్‌ రంగం కూడా అభివృద్ది చెందనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us