AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

El Nino Effect: ఎల్‌నినో ఎఫెక్ట్ మనపైనే కాదు.. వన్యప్రాణులపై కూడా..

ఎల్‌నినో ప్రభావంతో నల్లమల అడవుల్లో నీటి వనరులు తగ్గిపోవడంతో వన్యప్రాణులు తాగునీటి కోసం గ్రామాల వైపు వస్తున్నాయి. నంద్యాల జిల్లాలో నీటి కోసం వచ్చిన రెండు చుక్కల దుప్పులు ప్రమాదాల్లో చిక్కుకోగా.. గ్రామస్తులు, అటవీ సిబ్బంది సకాలంలో స్పందించి వాటిని రక్షించారు.

El Nino Effect: ఎల్‌నినో ఎఫెక్ట్ మనపైనే కాదు.. వన్యప్రాణులపై కూడా..
Deer Rescue
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Sep 12, 2026 | 12:36 PM

Share

ఎల్‌నినో ప్రభావం మానవ జీవనంపైనే కాదు.. ప్రకృతిపైనా, అడవుల్లోని వన్యప్రాణులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. వర్షాలు లేక అడవుల్లో నీటి వనరులు ఎండిపోవడంతో వన్యప్రాణులకు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా నల్లమల అడవుల్లో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. నీటి కోసం అడవులను వీడి సమీప గ్రామాలు, పంట పొలాల వైపు వస్తున్న వన్యప్రాణులు ప్రమాదాలకు గురవుతున్నాయి.

నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఎర్రగుడూరు గ్రామ సమీపంలో ఓ దుప్పి నీటి కోసం తెలుగు గంగా కాలువ వద్దకు వచ్చి ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బయటకు రాలేక సుమారు రెండు గంటల పాటు నీటిలో అటూ ఇటూ ఈదుతూ ప్రాణాలతో పోరాడింది. దుప్పి నీటిలో చిక్కుకున్న విషయాన్ని గమనించిన కొందరు రైతులు దాన్ని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే మనుషులు కనిపించడంతో బెదిరిపోయిన దుప్పి మరింత దూరంగా వెళ్లిపోయింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రైతులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి కాలువలో చిక్కుకున్న దుప్పిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదే సమయంలో ఆత్మకూరు మండలం ముష్టపల్లె గ్రామంలో మరో చుక్కల దుప్పికి ప్రమాదం ఎదురైంది. శుక్రవారం సాయంత్రం అడవిని వీడి పంట పొలాల వైపు వచ్చిన దుప్పికి ఎక్కడా నీరు దొరకలేదు. దీంతో గ్రామ సమీపంలోకి వచ్చిన దుప్పిని వీధి కుక్కలు వెంబడించాయి. కుక్కల నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీసిన దుప్పి చివరకు గ్రామంలోని పాడుబడిన గిలక బావిలో పడిపోయింది. దుప్పి బావిలో పడిన విషయాన్ని గుర్తించిన గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. కుక్కలను తరిమికొట్టి దుప్పికి ఎలాంటి హాని కలగకుండా చుట్టూ కాపలా కాశారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ సిబ్బంది తాళ్ల సహాయంతో బావిలో చిక్కుకున్న దుప్పిని జాగ్రత్తగా పైకి తీసుకొచ్చారు. అనంతరం దానిని తమ వాహనంలో తీసుకెళ్లి తిరిగి అడవిలో సురక్షితంగా వదిలారు.

అడవిలో నీటి వనరులు తగ్గడంతోనే గ్రామాల వైపు..

నల్లమల అడవులు అనేక రకాల వన్యప్రాణులకు సహజ ఆవాసం. దుప్పులు, చుక్కల దుప్పులు, అడవి పందులు, ఇతర జంతువులు ఈ అడవుల్లో సంచరిస్తుంటాయి. అయితే వర్షాభావ పరిస్థితులతో అడవుల్లోని సహజ నీటి వనరులు తగ్గిపోవడంతో మూగజీవాలు తాగునీటి కోసం జనావాసాల వైపు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అడవి నుంచి బయటకు వచ్చిన తర్వాత వన్యప్రాణులకు మరోవైపు ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి. గ్రామాల్లో వీధి కుక్కలు వెంటపడటం, బావులు, కాలువలు, రోడ్లు వంటి ప్రాంతాల్లో ప్రమాదాలకు గురికావడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

గ్రామస్తుల అప్రమత్తతతో రెండు ప్రాణాలు నిలిచాయి

ఇటీవల చోటుచేసుకున్న ఈ రెండు ఘటనల్లోనూ గ్రామస్తుల అప్రమత్తత కీలకంగా మారింది. కాలువలో చిక్కుకున్న దుప్పి విషయాన్ని గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీ సిబ్బంది సకాలంలో స్పందించారు. అలాగే ముష్టపల్లెలో బావిలో పడిన దుప్పిని కుక్కల నుంచి కాపాడుతూ గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. సకాలంలో అటవీ శాఖ సిబ్బంది స్పందించడంతో రెండు వన్యప్రాణాలు ప్రాణాలతో బయటపడ్డాయి.

వన్యప్రాణుల కోసం నీటి వనరులే రక్షణ కవచం

వర్షాభావ పరిస్థితులు కొనసాగితే అడవుల్లో నీటి కొరత వన్యప్రాణులకు మరింత సమస్యగా మారే అవకాశం ఉంది. సహజ నీటి వనరులను కాపాడటం, అవసరమైన చోట కృత్రిమ నీటి తొట్టెలను ఏర్పాటు చేయడం, గ్రామాల వైపు వచ్చే వన్యప్రాణులను కాపాడేందుకు స్థానికులు, అటవీ శాఖ సమన్వయంతో పనిచేయడం అత్యవసరంగా మారింది. అడవుల్లో నీరు ఉంటేనే వన్యప్రాణులు అడవుల్లోనే ఉంటాయి.. నీటి కోసం అవి జనావాసాల వైపు రాకుండా చర్యలు తీసుకోవడమే వాటి ప్రాణాలను కాపాడే ప్రధాన మార్గం.

Follow Us