చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో వెలుగులు చిమ్మే బాణాసంచా ఓ ఇంట్లో విషాదం మిగిల్చింది. దీపావళి వస్తోందని టపాసుల వ్యాపారం జోరుగా సాగుతుందని భావించిన మారేడుపల్లిలోని ఖాదర్ బాషా కుటుంబం.. బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడుకు గురైంది. టపాసులు వ్యాపారం చేసే ఖాదర్ బాషా ఎలాంటి పర్మిషన్ లేకుండానే ఇంట్లో బాణాసంచా తయారీ కేంద్రాన్ని కుటీర పరిశ్రమగా మార్చి కుటుంబాన్ని బలి తీసుకున్నాడు. శుక్రవారం రాత్రి ఖాదర్ భాషా ఇంట్లో జరిగిన ప్రమాదంలో ఆయనతో పాటు భార్య, కొడుకు మంటల్లో చిక్కుకుపోయారు.
టపాసుల తయారీకి ఉపయోగించే నల్లమందును ఇంట్లో నిల్వ ఉంచుకోవడమే కాదు.. అమ్మకానికి సిద్ధంగా ఉన్న బాణాసంచా స్టాక్‌ను సైతం ఖాదర్ భాషా తన ఇంట్లో ఉంచుకోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా బాణాసంచా పేలుడు సంభవించి.. మంటలు ఎగిసిపడటంతో కుటుంబమంతా చిక్కుకుపోయింది. ఈ అగ్ని ప్రమాదంలో ఖాదర్ బాషా, భార్య షహీనా, 7 ఏళ్ల కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. భారీ పేలుడుకు ఇంటి పైకప్పు సైతం కుప్పకూలింది.
ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఖాదర్ బాషాతో పాటు భార్య షహీనా, 7 ఏళ్ల కొడుకు ఉండగా.. భార్యాభర్తలు ఖాదర్ బాషా, షహీనా తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదంలో తీవ్ర కాలిన గాయాలతో 7 ఏళ్ల ఆజాద్ చికిత్స పొందుతున్నాడు. ఆజాద్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాద తీవ్రతకు ఇంటి పక్కనే ఉన్న పశువుల కొట్టంలోని రెండు అవులు కూడా మృతి చెందాయి. ప్రమాదం జరిగిన సమయంలో గ్రామంలో జాతర జరుగుతుండడంతో.. జనం అంతా అక్కడే ఉన్నారు.
ఎలాంటి అనుమతులు లేకుండా ఇంట్లో బాణాసంచా తయారు చేస్తున్న ఖాదర్ బాషా కుటుంబం ఈ ప్రమాదానికి గురికాగా..
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో మంటలను పూర్తిగా అదుపు చేసిన ఫైర్ సిబ్బంది ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తోంది. భారీ పేలుడుకు ఇంట్లో నిల్వ ఉంచిన నల్ల మందు కారణమా, లేక తయారు చేసి అమ్మకానికి సిద్ధంగా ఉన్న బాణాసంచా కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అనుమతులు లేకుండా బాణాసంచా తయారీ, నిల్వ చేసిన కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు.