Bhogi: తెలుగు రాష్ట్రాల్లో భోగి శోభ.. ఊరూరా, ఇంటింటా భోగి మంటలు.. నేతల ఇళ్ల అంబరాన్నంటిన సంబరాలు..

|

Jan 14, 2023 | 7:50 AM

తెలుగు వారి పెద్ద పండుగల్లో ఒకటి సంక్రాంతి. నాలుగు రోజులు జరుపుకునే ఈ పండుగలో తొలిరోజైన భోగి ప్రత్యేకమైనది. భోగభాగ్యాలు తెచ్చే తెలుగు వారి భోగి అంటే.. చలి మంట మాత్రమే కాదు.

Bhogi: తెలుగు రాష్ట్రాల్లో భోగి శోభ.. ఊరూరా, ఇంటింటా భోగి మంటలు.. నేతల ఇళ్ల అంబరాన్నంటిన సంబరాలు..
Bhogi Celebrations
Follow us on

తెలుగు వారి పెద్ద పండుగల్లో ఒకటి సంక్రాంతి. నాలుగు రోజులు జరుపుకునే ఈ పండుగలో తొలిరోజైన భోగి ప్రత్యేకమైనది. భోగభాగ్యాలు తెచ్చే తెలుగు వారి భోగి అంటే.. చలి మంట మాత్రమే కాదు. ప్రతి సంవత్సరం సూర్యుడు మకర రాశిలోకి వెళ్లే ముందురోజు భోగి పండుగు జరుపుకుంటారు. అలా చలికి టాటా చెబుతారు. ఈ మంటల్లో ఇళ్లలోని పాత వస్తువులు, విరిగిపోయిన మంచాలు, కుర్చీలు, వాడని వాటిని వేసేస్తారు. అలా.. ఇంట్లో దరిద్రం వదిలిపోతుందని నమ్ముతారు. భోగి నుంచి ఇళ్లలో పండుగ కళ వస్తుంది. తెలుగు లోగిళ్లు సరికొత్తగా కళకళలాడుతాయి. బంధువులు, స్నేహితులతో తెలుగు పల్లెల్లో.. పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇక ఇళ్ల ముందు రంగుల ముగ్గులు, గడపలకు మామిడితోరణాలు, పిల్లల తలపై రేగి పండ్లు వేస్తూ ఇచ్చే దీవెనలు, ఆకాశాన్ని వర్ణ రంజితం చేసే గాలిపటాలు.. ఇలా భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ నాడు తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఆనందమే వేరు.

తెలుగురాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. తెలుగు లోగిళ్లలో కొత్త సందడి నెలకొంది. పల్లెలన్నీ పండుగ సందడి చేస్తున్నాయి. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో భోగి మంటలు మండుతున్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా భోగిమంటల చుట్టూ ఆడిపాడుతూ సంబురాలు జరుపుకుంటున్నారు. విజయవాడలో ఘనంగా భోగి సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. భోగి మంటలు వెలిగించారు నగర వాసులు. మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటి దగ్గర భోగి సందడి నెలకొంది. భోగి వేడుకల్లో వెల్లంపల్లి పాల్గొన్నారు. హరిదాసులు, గంగిరెద్దులు సందడి చేస్తున్నాయి.

నిప్పు రవ్వల కణకణలు.. ఎగిసిపడే మంటల భగభగలు.. చీకట్లను చీల్చే ఆ కాంతులు చైతన్యరావాలు.. గజగజా వణికించే చలి పారిపోయేలా మంచు తెరలు వీడిపోయేలా ఆ మంటల్లో పాతకు స్వస్తి. కొత్తకు స్వాగతం. నిద్రమత్తు వదిలించి.. ఉత్సాహం ఉరకలెత్తించే వేడుక సంక్రాంతి. భోగితో శ్రీకారం చుట్టాయి తెలుగు లోగిళ్లు. కోనసీమలోనూ సంక్రాంతి సందడి షురూ అయింది. భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఎంజాయ్‌ చేశారు జనం. రావులపాలెం, కొత్తపేట, రాజోలు, అమలాపురం, పి గన్నవరం, అల్లవరం ప్రాంతాల్లో భోగి సందడి కనిపిస్తోంది. ముహూర్తం ప్రకారం భోగి మంటలు వేసి పండుగ చేసుకుంటున్నారు.

కోనసీమ, నెల్లూరు జిల్లాల్లో సంక్రాంతి వేడుకలు షురూ అయ్యాయి. రావులపాలెం, కొత్తపేట, అమలాపురం ప్రాంతాల్లో భోగిమంటలు వేశారు. ఓ పక్క మంచు తెరలు.. మరోపక్క భోగిమంటలతో వాతావరణం ఆహ్లాదంగా మారింది. తిరుపతి జిల్లా నారావారిపల్లెలో భోగి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. టీడీపీ చీఫ్‌ చంద్రబాబు ఇంటిదగ్గర నటుడు బాలయ్య కుటుంబసభ్యులతో కలిసి భోగిమంటలు వేశారు. తిరుపతి జిల్లా రంగంపేటలో నటుడు మోహన్‌బాబు కుటుంబంతో కలిసి భోగి సంబురాలు జరిపారు. భోగి ప్రతిఒక్కరికి భోగభాగ్యాలివ్వాలని ఆకాంక్షించారు. ప్రతిఏటా గ్రామంలో సంక్రాంతి జరుపుకుంటున్నట్లు చెప్పారు.

తెలంగాణలో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. వరంగల్‌ జిల్లా పర్వతగిరిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ భోగి వేడుకల్లో పాల్గొన్నారు. సొంతూరులో కుటుంబసభ్యులతో కలిసి భోగిమంటల చుట్టూ ఆడిపాడారు. ప్రజలకు అంతాశుభం జరగాలని కోరుకున్నారు. హైదరాబాద్‌ కేబీఆర్‌ పార్కు దగ్గర భోగి వేడుకలు మిన్నంటాయి. ఎమ్మెల్సీ కవిత సంబురాల్లో పాల్గొని భోగిమంటలు వెలిగించారు. వేడుకల్లో భాగంగా బసవన్నల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో భోగి వేడుకలు వైభవంగా జరుపుకుంటున్నారు. యువతులు భోగిమంటల చుట్టూ ఉత్సాహంగా నృత్యం చేశారు. డూడూ బసవన్నల విన్యాసాలు, కోలాటాలతో హోరెత్తించారు. వరంగల్‌ జిల్లాలో భోగి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. మంటల చుట్టూ డీజే పాటలు, కోలాటాలతో హోరెత్తిస్తున్నారు. కుటుంబసమేతంగా సంప్రదాయ వస్త్రధారణలో వేడుక చేసుకుంటున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..