
అమాయకంగా కనిపిస్తాడు.. బ్యాంకు ఏటీఎం సెంటర్ల వద్ద కాపుకాస్తాడు.. వృద్ధులు, నిరక్షరాస్యుల కోసం ఎదురు చూస్తాడు.. అదను కోసం వేచి చూసి జనాలను మస్కా కొడతాడు.. సాయం చేస్తున్నట్టు నటించి ఖాతాలు కొల్లగొట్టేస్తాడు.. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఇరవై చోట్ల ఏటీఎం సెంటర్ల వద్ద మస్కా కొట్టి మాయ చేసి డబ్బులు లాగేసాడు ఈ కేటుగాడు.. అలాంటి మాయలోడు ఎట్టకేలకు అనకాపల్లి జిల్లా పోలీసుల చేతికి చిక్కి కటకటాల వెనక్కు వెళ్ళాడు. వాడు మామూలోడు కాదు.. ఇంటర్ స్టేట్ క్రిమినల్ అంటూ అనకాపల్లి పోలీసులు ప్రకటించారు.
వివరాల్లోకి వెళితే.. నర్సీపట్నం మండలం ధర్మసాగరం గ్రామానికి చెందిన నూకరాజు ఈ నెల 17న నగదు డ్రా చేయానికి యూనియన్ బ్యాంక్ ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు. అతనికి ఏటీఎంతో డబ్బులు డ్రా చేయడం తెలియక ఇబ్బందిపడ్డాడు. దీంతో అక్కడున్న గుర్తు తెలియని వ్యక్తిని సహాయం అడిగాడు. అయితే అప్పటికే అవకాశం కోసం ఎదురుచూస్తున్న.. ఆ వ్యక్తి నూకరాజు నుంచి ఏటీఎం కార్డు తీసుకొని పిన్ నంబరు అడిగాడు. మూడుసార్లు ఏటీఎం మెషీన్‌లో కార్డు పెట్టి డబ్బులు రావడం లేదని చెప్పి.. ఏటీఎం కార్డు తిరిగి ఇచ్చేసాడు. ఆ సమయంలో కార్డును తారుమారు చేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత నూకరాజు ఏటీఎం కార్డుతో 15వేలు నగదు తీసినట్టు సెల్‌ఫోన్‌కి మెసేజ్ వచ్చింది. ఆందోళన చెందిన నూకరాజు బ్యాంక్‌కి వెళ్లి అడిగాడు. అతని ఖాతా నుంచి 15 వేలు విత్ డ్రా చేసినట్టు బ్యాంక్ అధికారులు చెప్పారు. దీంతో మోసపోయానని తెలుసుకుని.. పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు నూకరాజు.
నర్సీపట్నం టౌన్ సీఐ గఫూర్ ప్రత్యే బృందాన్ని ఏర్పాటు చేసి సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ ప్రారంభించారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో.. ఇదే తరహా ఘటనలు రాష్ట్రంలో చాలా చోట్ల జరిగినట్లు గుర్తించారు. నిందితుడు ప్రకాశం జిల్లా వీరన్నపాలెం గ్రామానికి చెందిన మువ్వ వీరయ్య చౌదరిగా నిర్ధారించుకున్నారు. విచారణ వేగవంతం చేసి వీరయ్య చౌదరిని ట్రాక్ చేయడం ప్రారంభించారు. అయితే.. నిందితుడు ప్రస్తుతం విశాఖ జిల్లా మర్రిపాలెంలో ఉంటున్నట్టు గుర్తించారు. అనంతరం వీరయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు.
వీరయ్య చౌదరి కేవలం నర్సీపట్నం మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో వేరువేరు చోట్ల ఇటువంటి నేరాలకు పాల్పడ్డాడు. అతనిపై మిర్యాలగూడ టూ టౌన్‌లో 2, పాలకొండ, ఆముదాలవలస, లాలాపేట, జనగాం, కాజీపేటలో ఒక్కో కేసు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు.
2017 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వేరువేరు చోట్ల 20 కేసులు నమోదయ్యాయని చెప్పారు డీఎస్పీ శ్రీనివాసరావు. వీరయ్య చౌదరిని అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెట్టారు. నిందితుడి నుంచి 10 వేల నగదు, 9 ఏటీఎం కార్డులు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
ఏటీఎం సెంటర్‌కు వెళ్లినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులకు ఏటీఎం కార్డు ఇచ్చి పిన్ నంబర్లు చెబితే అంతే సంగతులు అని అంటున్నారు పోలీసులు. మూడో కంటికి తెలియకుండా పిన్ నెంబర్ ఎంటర్ చేసి ఏటీఎం సెంటర్లో నుంచి నగదు విత్ డ్రా చేయాలని సూచిస్తున్నారు. ఎటువంటి అనుమానం ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచనలు జారీ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..