Andhra Pradesh: ఏప్రిల్‌ నెలలో ఆలస్యంగా పింఛన్‌.. ఏపీలో పింఛన్లపై సెర్ప్ కీలక ఆదేశాలు! కారణం ఇదే!

|

Mar 28, 2024 | 9:09 AM

ప్రతి నెలా ఒకటో తారీఖున ఠంఛన్‌గా ఇచ్చే పింఛన్లు వచ్చే నెలలో ఆలస్యం కానున్నాయి. ఏప్రిల్‌ నెలలో పింఛన్ల పంపిణీ ఒకటో తారీఖున కాకుండా 3వ తేదీ నుంచి రాష్ట్ర సర్కార్ పంపిణీ చేయనుంది. మార్చి నెలతో ముగుస్తోన్న ఆర్థిక సంవత్సరంతో పాటు వరుస బ్యాంకు సెలవుల కారణంగానే ఆలస్యం అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల డీఆర్‌డీఏ పీడీలకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) అధికారులు..

Andhra Pradesh: ఏప్రిల్‌ నెలలో ఆలస్యంగా పింఛన్‌.. ఏపీలో పింఛన్లపై సెర్ప్ కీలక ఆదేశాలు! కారణం ఇదే!
Distribution of pension in AP
Follow us on

అమరావతి, మార్చి 28: ప్రతి నెలా ఒకటో తారీఖున ఠంఛన్‌గా ఇచ్చే పింఛన్లు వచ్చే నెలలో ఆలస్యం కానున్నాయి. ఏప్రిల్‌ నెలలో పింఛన్ల పంపిణీ ఒకటో తారీఖున కాకుండా 3వ తేదీ నుంచి రాష్ట్ర సర్కార్ పంపిణీ చేయనుంది. మార్చి నెలతో ముగుస్తోన్న ఆర్థిక సంవత్సరంతో పాటు వరుస బ్యాంకు సెలవుల కారణంగానే ఆలస్యం అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల డీఆర్‌డీఏ పీడీలకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) అధికారులు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. మార్చి 31న ఆదివారం, ఏప్రిల్‌ 1న ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి. దీంతో సచివాలయాల సిబ్బంది పింఛను నగదును ఏప్రిల్‌ 2న డ్రా చేసుకుని, మూడో తేదీ నుంచి పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సమాచారం అందించారు. కాగా గతేడాది కూడా ఏప్రిల్‌ నెలలో 3వ తేదీ నుంచి పింఛన్లను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రం కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ గ్రామ వలంటీర్ల ద్వారా యధావిధిగా లబ్ధిదారులకు ఇళ్ల వద్దే పింఛన్‌ అందిస్తామని అధికారులు తెలిపారు. అయితే ఎన్నికల కోడ్‌తో అమల్లో ఉండటంతో సెర్ప్‌ ప్రత్యేక మార్గదర్శకాలను బుధవారం అన్ని జిల్లాల పీడీలు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో నిర్దేశిత పరిమితికి మించి నగదు తీసుకువెళ్లకూడదనే ఆంక్షలు ఉన్నాయి. అయితే లావాదేవీలకు సంబంధించిన రశీదులు చూపి తీసుకెళ్లవచ్చు. దీంతో పింఛన్ల పంపిణీలో పాల్గొనే సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసిన తర్వాత బ్యాంకు సిబ్బంది ఇచ్చే రశీదులను తప్పనిసరిగా తమ వద్దే ఉంచుకోవాలని, పోలీసుల తనిఖీల్లో వాటిని చూపాలని సెర్ప్‌ అధికారులు సూచించారు.

పింఛన్‌ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనే వారి వివరాలను ఎంపీడీవోలు/మున్సిపల్‌ కమిషనర్లు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులు (ఆర్వో)లకు ముందుగానే సమాచారం అందించాలని ఆదేశించారు. సచివాలయాల పేర్లు, నగదు వివరాలతో కూడిన ధ్రువీకరణ పత్రాలు సంబంధిత సిబ్బంది తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు. ఆయా ధ్రువీకరణ పత్రాలను నిర్దేశిత ఫార్మాట్‌లో ఎంపీడీవోలు/మున్సిపల్‌ కమిషనర్ల లాగిన్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. పింఛన్లు పంపిణీ సమయంలో ఏదైనా రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేయడం, ఫొటోలు, వీడియోలు తీయడానికి ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.