Srisailam: రాత్రి పూట ఆలయానికి వచ్చిన అనుకోని అతిథి..

అడవుల్లో ఆహారం, నీరు దొరక్క ఇబ్బంది పడుతున్న వన్యమృగాలు గ్రామాల్లోకి వస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. శ్రీశైలం ఘాట్ రోడ్డుపై ఉన్న అభయ ఆంజనేయస్వామి ఆలయంలోకి ఎలుగుబంటి ప్రవేశించడం భక్తుల్లో ఆందోళన కలిగించింది. కొద్దిసేపటికి ఎలాంటి హాని చేయకుండా తిరిగి అడవిలోకి వెళ్లిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Srisailam: రాత్రి పూట ఆలయానికి వచ్చిన అనుకోని అతిథి..
Bear In Temple

Edited By:

Updated on: Apr 21, 2026 | 1:40 PM

అడవుల్లో పగలు ఎండవేడికి తట్టుకోలేక, ఆహారం లభించక ఇబ్బందులు పడుతున్న వన్యమృగాలు రాత్రి వేళల్లో జనసంచారంలోకి వస్తున్నాయి. అటవీ సమీప గ్రామాల్లోకి ఆహారం, నీటికోసం తరచూ వన్యప్రాణులు వస్తుండటంతో గ్రామాల్లో ఆందోళన నెలకొని ఉంది. ఈ ఇబ్బందిని నివారించేందుకు అటవీశాఖ అక్కడక్కడ నీటికుంటలు ఏర్పాటు చేస్తున్నా కొన్ని అడవి జంతువులు రాత్రిళ్ళు ఆహారం కోసం బయటకు వస్తున్నాయి. అలా వచ్చిన ఓ ఎలుగుబంటి శ్రీశైలం ఘాట్‌రోడ్డు పక్కన ఉన్న శ్రీ అభయాంజనేయస్వామి గుడిలోకి వెళ్ళడం భక్తులు గమనించి అప్రమత్తమయ్యారు. అయితే ఎలుగు ఎలా వచ్చిందో అలా తిరిగి వెళ్ళిపోవడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.

మార్కాపురంజిల్లా డోర్నాల మండలం చిన్నారుట్ల వద్ద శ్రీశైలం ఘాట్ రోడ్డు పక్కన ఉన్న శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయంలోకి రాత్రి ఎలుగుబంటి ప్రవేశించింది. కొద్ది సేపు ఆలయం లోపల కలియ తిరిగిన ఈ వన్యప్రాణి అడవిలోకి వెళ్ళిపోయింది. ఎలుగు బంటి ఆలయం లోపలికి వెళ్ళిన దృశ్యాలను గుడి దగ్గర ఉన్న భక్తులు, అటుగా వెళుతున్న వాహనదారులు చూసి సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు. ఆలయం వద్ద భక్తులు కొబ్బరి కాయలను కొట్టి ఆ చిప్పలతోపాటు పండ్లు స్వామి విగ్రహం దగ్గర నైవేద్యం పెడుతుంటారు. గుడిలో ఆహారపదార్ధాల కోసం ఎలుగుబంటి వచ్చిందని భావించి దానికి ఇబ్బంది కలగకుండా భక్తులు వేచి చూశారు. కొద్దిసేపటి అనంతరం ఎలుగబంటి తిరిగి అడవిలోకి వెళ్ళిపోవడంతో భక్తులు ఊరట చెందారు.

Follow Us