
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని జీడిమామిడి తోటలో ఎలుగుబంటి దాడిలో ఇద్దరు కూలీలు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురు వ్యక్తులు జీడిమామిడి తోటలో పని చేస్తుండగా చుట్టుపక్కల ఉన్న ఎలుగుబంటి బయటకు వచ్చి వారిపై దాడి చేసింది. వారు సహాయం కోసం కేకలు వేయడంతో ఇతర కార్మికులు, గ్రామస్తులు వచ్చి ఎలుగుబంటిని తరిమికొట్టారు. అయితే ఎలుగుబంటి దాడిలో గాయపడిన అప్పికొండ కూర్మారావు (45), లోకనాథం (46) మృతి చెందారు. మరో కార్మికురాలు సావిత్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
అటవీ, పోలీసు శాఖల అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు అనకాపల్లి, పరిసర గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అడవి ఎలుగుబంట్లు తరచుగా జీడిమామిడి తోటలలోకి ప్రవేశిస్తాయి. శ్రీకాకుళం జిల్లా అటవీ అధికారి నిషా కుమారి మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు వైద్య ఖర్చులతో పాటు నిర్దేశిత విధానాల ప్రకారం నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు. టెక్కలి సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఎలుగుబంట్ల కదలికలను పర్యవేక్షిస్తున్నారు. జీడిమామిడి తోటల సిబ్బంది విధులు నిర్వర్తించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఏపీలో అటవీ జంతువులు అడవులను దాటి జనావాసాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా చిత్తురు, శ్రీకాకుళం జిల్లాలో వీటి సంచారం ఎక్కువగా ఉంది. అందుకే రాత్రి వేళలో జనాలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండగా, శ్రీకాకుళంలో ఎలుగుబంట్ల తాకిడి ఎక్కువగా ఉంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రజలపై దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. వీటి భయం కారణంగా జనాలు గుంపుగుంపులుగా తిరుగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఎలుగుబంట్ల సంచారం మాత్రం తగ్గడం లేదు.