AP Crime News: ఓ పక్క శాస్త్రసాంకేతిక విజ్ఞానం అభవృద్ధి పథంలో దూసుకుపోతోందని ఢంకా బజాయించి చెప్పుకుంటున్నాం. కానీ మరో వైపు పల్లెల్లో నెత్తుటిఏరులు పారిస్తున్నాయి మూఢనమ్మకాలు. తాజాగా క్షుద్రపూజల వ్యవహారం మూడు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఇంకా పుట్టని ఓ పసిగుడ్డును కూడా మింగేసింది. తాంత్రిక పూజలు చేస్తూ తన ఎదుగుదలకు అడ్డం వస్తున్నారని సొంత బాబాయ్ కుటుంబంపై అతి కిరాతకంగా రాళ్లతో దాడి చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటనలో నిందితుడి పిన్ని ఈశ్వరమ్మ సంఘటనా స్థలంలోనే మృతిచెందగా.. బాబాయ్ తిరుమలయ్య, చెల్లెలు స్వప్న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆరు నెలల గర్భిణి అయిన స్వప్న 9 రోజులపాటు మృత్యువుతో పోరాడి తనువు చాలించింది. ఈ దారుణ సంఘటన ప్రకాశం జిల్లా(Prakasam District) గిద్దలూరు మండలం కొత్తపల్లి గ్రామం(Kothapalli Village)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఈనెల 12వ తేదీ క్షుద్ర పూజల అనుమానంతో కుక్క మల్లికార్జున యాదవ్ అనే యువకుడు సొంత బాబాయి కుటుంబంపై పాశవికంగా రాళ్లతో దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ పిన్ని ఈశ్వరమ్మ సంఘటనా స్థలంలోనే మృతిచెందగా.. బాబాయ్ తిరుమలయ్య, చెల్లెలు స్వప్న తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని నంద్యాలలోని శాంతిరాం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తిరుమలయ్య ఆరోగ్య పరిస్థితి మెరుగు కాకపోవడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు తరలించారు. అక్కడ రెండు రోజులపాటు చికిత్స పొందిన తిరుమలయ్య మృతి చెందాడు.
ఇక చెల్లెలు స్వప్న పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. తొమ్మిది రోజులపాటు వైద్యులు చికిత్స అందించినా స్వప్న పరిస్థితులు ఎటువంటి మార్పు కనిపించలేదు. స్వప్న ఆరు నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు తెలిపారు. దాడిలో స్వప్న గర్భంలోని పిండం చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఆమెను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. ప్రాణాలు నిలబడలేదన్నారు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. నిందితుడు కుక్క మల్లికార్జున యాదవ్ దాడి తర్వాత సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. అప్పటినుంచి పోలీసులు నిందితుడి కోసం పలు బృందాలుగా విడిపోయి గాలిస్తూనే ఉన్నారు. ఓ స్వామీజీ చెప్పిన మాటలు నమ్మి క్షుద్ర పూజల అనుమానంతో కుక్క మల్లికార్జున యాదవ్ దాడికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేల్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..