Andhra Pradesh News: అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలోని ఓ గ్రామంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అనుకోని అతిథి రాకతో స్థానిక గిరిజనులు ఆనందానికి గురైయ్యారు. ఇంతకీ వారి ఆనందానికి కారణం ఏంటో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. ఏజెన్సీలోని గెడ్డంపుట్ట అనే గ్రామంలోకి అడవిలో నుంచి ఓ జింకపిల్ల పరుగులు పెడుతూ వచ్చింది. ఉదయం ఏడు గంటలకే గ్రామానికి అతిధిగా వచ్చిన జింక పిల్లను ఆసక్తిగా చూసేందుకు గ్రామస్థులంతా పరుగులు తీశారు. కుక్కలు కూడా తరమడంతో.. కొండమ్మ అనే గిరిజనురాలు ఇంటిలోకి వెళ్లి నక్కి కూర్చుంది ఆ జింకపిల్ల. భయంతో ఓ మూల ఉండిపోయింది. అయితే ఆ జింక పిల్లకు స్థానికులు ఎవరూ ఎటువంటి హాని తలపెట్టలేదు. దాన్ని భయాన్ని చూసి.. పట్టుకునేందుకు కూడా ప్రయత్నించలేదు. అక్కడే కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకున్న జింకపిల్ల.. మళ్లీ కాసేపటికి చెంగు చెంగున ఎగురుకుంటూ అడవి వైపుకు వెళ్ళిపోయింది.
అనుకోని అతిధి అలా వచ్చి ఇలా వెళ్లడంతో స్థానిక గిరిజనలు ఆనందం వ్యక్తం చేశారు. జింక పిల్ల తమ ఇంట్లోకి వచ్చి వెళ్లడం చాలా సంతోషం కలిగిస్తున్నట్లు కొండమ్మ తెలిపారు. తల్లి జింక నుంచి విడిపోయి ఇది గ్రామంలోకి వచ్చి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. అయినా అనుకోని అతిథిలా జింక పిల్ల తమ గ్రామంలోకి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
మరిన్ని ఏపీ కథనాలు చదవండి..