ఆందోళన బాటలో ఏపీ ఎన్జీవోలు.. డీఏ బకాయిలు, బిల్లుల కోసం

|

Feb 11, 2024 | 10:05 PM

ఏపీ ఎన్జీవోలు మళ్లీ ఆందోళన బాట పట్టడానికి సిద్ధమవుతున్నారు. డీఏ బకాయిలు, బిల్లుల చెల్లింపుల కోసం ఉద్యమ కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు. ఇవాళ మంత్రుల బృందంతో జరిగే చర్చలు విఫలం అయితే ఏ క్షణంలో అయినా మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఎన్నికల వేళ ఎన్జీవోల హెచ్చరికలు సర్కార్‌కు అలారం బెల్స్‌ మోగిస్తున్నాయి.

ఆందోళన బాటలో ఏపీ ఎన్జీవోలు..  డీఏ బకాయిలు, బిల్లుల కోసం
APNGO Association
Follow us on

ఏపీ ఎన్జీవోలు మరోసారి ఆందోళన బాట పట్టడానికి రెడీ అవుతున్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వాళ్లు ఆరోపిస్తున్నారు. పన్నెండో పీఆర్సీ కమిషన్‌ పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటున్నారు. 2 పెండింగ్‌ డీఏలు చెల్లించాలని, జీపీఎఫ్‌ బిల్లులు చెల్లించట్లేదని ఎన్జీవోలు వాపోతున్నారు. తమకు ప్రతి నెల 1వ తేదిన వేతనాలు, పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదని, ఇంకా అనేక పెండింగ్‌ సమస్యలు ఉన్నాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.

ఇలాంటి డిమాండ్లతో ఏపీ ఎన్జీవోలు విజయవాడలో భేటీ అయ్యారు. ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో 104 ఉద్యోగ సంఘాలతో, కార్యవర్గంతో ఎన్జీవో నేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ డిమాండ్ల సాధన కోసం విడతలవారీగా ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈనెల 14న నల్ల బ్యాడ్జీలు ధరించి అన్ని కార్యాలయాల్లో అధికారులకు మెమోరాండాలు సమర్పిస్తారు. ఇక 15, 16వ తేదీల్లో భోజన విరామ సమయంలో నిరసన చేపట్టబోతున్నామన్నారు ఎన్జీవో నేతలు. 17 న తాలుకా కేంద్రాల్లో ర్యాలీలు, 20న కలెక్టరేట్ల దగ్గర ధర్నాలకు సిద్ధమవుతున్నాయి ఉద్యోగ సంఘాలు. 21నుండి 24 వరకు అన్ని జిల్లాల్లో పర్యటించి, 27వ తేదీన చలో విజయవాడ చేపడతామంటున్నారు ఎన్జీవో నేతలు. ప్రభుత్వంతో చర్చలు సఫలం కాకపోతే సమ్మెకు సైరన్ మోగిస్తామని హెచ్చరిస్తున్నారు.

ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ, ఆందోళనకు సిద్ధమవుతున్న ఎన్జీవోలను ఏపీ సర్కార్ ఎలా శాంతింపజేస్తుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…