
పల్లెల్లో పంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది. తొలి విడత గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకముందే గ్రామాల్లో ఏకగ్రీవాల పర్వం ఊపందుకుంది. ఎన్నికల ఖర్చులు, వర్గ విభేదాలకు తావులేకుండా గ్రామాభివృద్ధే లక్ష్యంగా స్థానికులు ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపుతుండగా.. కొన్నిచోట్ల సర్పంచ్ పదవులకు ఏకంగా బహిరంగ వేలంపాటలు నిర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డ పంచాయతీలో సర్పంచ్ పదవి కోసం జరిగిన వేలంపాట ఇప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచింది. 5వేల లోపు జనాభా ఉన్న ఈ పంచాయతీకి తొలి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. గ్రామంలో ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవం చేయాలని రెండు ప్రధాన పార్టీల నేతలు నిర్ణయించుకున్నారు. అయితే సర్పంచ్ పదవి కోసం ముగ్గురు అభ్యర్థులు పోటీకి సిద్ధపడటంతో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై గ్రామ పెద్దలు సమాలోచనలు జరిపారు.
చివరికి వేలంపాట ద్వారా అభ్యర్థిని ఖరారు చేయాలని నిర్ణయించారు. రెండు రోజుల క్రితం గ్రామ పెద్దల సమక్షంలో నిర్వహించిన ఈ వేలంపాటలో ఇద్దరు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కొరటా గోపాలరావు రూ.77 లక్షలు ఇచ్చేందుకు ముందుకు రాగా ఆయనకంటే మిన్నగా యర్రా శ్రీనివాసరావు రూ.81 లక్షలు చెల్లించేందుకు అంగీకరించారు. దీంతో ఆయన్నే ఏకగ్రీవ అభ్యర్థిగా బరిలోకి దించాలని గ్రామ పెద్దలు తీర్మానించారు. వేలం ముగిసిన వెంటనే గ్రామంలో యర్రా శ్రీనివాసరావు పేరిట ఫ్లెక్సీలు కూడా వెలిశాయి.
ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భారీ నజరానాలను ప్రకటించింది.
జొన్నలగడ్డ పంచాయతీ ఏకగ్రీవమైతే, అభ్యర్థి చెల్లించే రూ.81 లక్షలకు తోడు ప్రభుత్వం ఇచ్చే రూ.15 లక్షల ప్రోత్సాహక నిధి కూడా జమ అవుతుంది. ఈ నిధులన్నింటినీ గ్రామ అభివృద్ధికి వినియోగించవచ్చని స్థానికులు భావిస్తున్నారు.