Panchayat Elections 2021: ఏపీలో ఓ వైపు నిమ్మగడ్డ రమేష్ కు ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. మరోవైపు పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి దశ ఎన్నికలు నామినేషన్ల కొనసాగుతుంది. నేటితో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది. సాయంత్రం 5 గంటల్లోగా నామినేషన్లు దాఖలు చేయాలి. అభ్యర్థులు నామినేషన్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. దీంతో ఈరోజు నామినేషన్లు భారీ సంఖ్యలో దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువగా నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ స్థానాలకు దాదాపు 7 వేల 460 నామినేషన్లు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. వార్డు స్థానాలకు 23 వేల 318 నామినేషన్లు వేశారు. మొదటి రోజుతో పోలిస్తే రెండోరోజు భారీగా పెరిగాయి. శుక్ర, శనివారం రెండు రోజులు కలిపి ఇప్పటి వరకు సర్పంచ్ స్థానాలకు 8 వేల 773 నామినేషన్లు దాఖలవ్వగా… వార్డు సభ్యుల స్థానాలకు 25వేల 519 మంది నామినేషన్లు వేశారు.
ఇప్పటి వరకు వచ్చిన నామినేషన్లలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 11 వందల 56 వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లాలో వార్డు సభ్యుల స్థానాలకు అత్యధికంగా 4 వేల 678 నామినేషన్లు వేశారు. తొలివిడత పోరులో నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 4 తుది గడువు.. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటిస్తారు. అనంతరం అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. మొదటి దశ పోలింగ్ ఫిబ్రవరి 9న నిర్వహించనున్నారు. అదేరోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఫలితాలు వెలువడతాయి. ఇక రెండో దశ పంచాయతీ ఎన్నికలకు ఫిబ్రవరి 2న నోటిఫికేషన్ వెలువడనుంది. మరోవైపు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేటి నుంచి రాయలసీమ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. అక్కడ ఎన్నికల ఏర్పాట్లపై స్వయంగా సమీక్ష చేయనున్నారు.
Also Read: కొత్త అవతారం ఎత్తి గరిట పట్టిన రాహుల్ .. ఓట్ల కోసం పాట్లు..