AP local body Elections : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఇవాళ తొలి విడత పోలింగ్ జరుగుతుంది. గ్రామాల్లో ఓటు వేసేందుక జనం భారీగా పోలింగ్ బూత్‌కు తరలివస్తున్నారు. ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకూ ఓటు హక్కు వినియోగించుకోవల్సి ఉంటుంది.
ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లోనూ ఒక ఓటరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒక ఓటు సర్పంచ్ బరిలో నిలిచిన అభ్యర్థికి, మరో ఓటు బరిలో నిలిచిన వార్డు అభ్యర్థికి వేయాల్సి ఉంటుంది. సర్పంచ్ అభ్యర్థులకు గులాబీ, వార్డు అభ్యర్థులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపరును ఓటర్లకు అందజేస్తారు. సర్పంచ్ అభ్యర్థి పోటీలో ఉండి, వార్డు పదవి ఏకగ్రీవమైతే ఓటరు ఒక ఓటు మాత్రమే వేయాల్సి ఉంటుంది. అలా కాకుండా సర్పంచ్ పదవి ఏకగ్రీవమై, వార్డు పదవికి పోటీ జరిగితే అప్పుడు కూడా ఓటరుకు ఒక ఓటు మాత్రమే ఇస్తారు.
✦ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు వెళ్లాలంటే ఓటరు స్లిప్పు తప్పనిసరి.
✦ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో సిబ్బంది ఇంటింటికీ వచ్చి ఫొటోలతో ఉన్న ఓటరు స్లిప్పులు పంపిణీ చేశారు.
✦ఓటరు స్లిప్పు అందకపోతే వారికి.. పోలింగ్ కేంద్రం వద్ద పంచాయతీ సిబ్బంది ఓటరు స్లిప్పులు అందిస్తారు.
✦ఓటరు స్లిప్పుతో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
✦ఓటరు కార్డు, ఆధార్, రేషన్, బ్యాంకు పాస్‌పుస్తకం, పాస్‌పోర్టు ఇలా ఒక గుర్తింపు కార్డు తప్పనిసరి.
✦కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటు వేయాల్సి ఉంటుంది.
✦ప్రతి ఒక్కరికి ముఖానికి మాస్క్ తప్పనిసరి.
✦క్యూలో నిల్చున్న వారికి ఎన్నికల సిబ్బంది రెండు బ్యాలెట్లు ఇస్తారు.
✦సర్పంచ్ బ్యాలెట్, వార్డు సభ్యుడి బ్యాలెట్ ఇస్తారు.
✦రెండు బ్యాలెట్ పేపర్లపై స్వస్తిక్ గుర్తు సిరాతో ఓటు వేయాల్సి ఉంటుంది.
✦పోలింగ్ సిబ్బంది చెప్పిన ప్రకారం బ్యాలెట్‌ను మడత పెట్టాలి.
✦ఓటు వేయలేని వృద్ధులు, వికలాంగులు సహాయకుల సహాయంతో ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం కల్పించారు ఎన్నికల అధికారులు.
✦వికలాంగులు, వృద్ధులు వారికి నచ్చిన వ్యక్తులను సహాయకులు ఎంచుకోవచ్చు.
✦కరోనా సోకిన వ్యక్తి ఓటు వేయడానికి అవకాశం కల్పించారు.
✦ఆఖరి గంటలో స్థానిక ఆరోగ్య శాఖ సిబ్బంది సహాయంతో తగు భద్రతా ప్రమాణాలు పాటించి కరోనా బాధితులు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
✦ఓటు వేసి సెల్ఫీ తీసుకుంటే సంబంధిత ఓటును రద్దు చేసే అధికారం పోలింగ్ అధికారికి ఉంది.
Read Also… AP local polls : ఏపీలో ఊపందుకున్న పోలింగ్.. భారీగా బారులు తీరిన ఓటర్లు.. ఇప్పటివరకు 22శాతం పోలింగ్