AP Panchayat Elections 2021: ఏపీ లో పంచాయితీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఏకగ్రీవాలు పోనూ.. మిగిలిన పంచాయతీల్లో అభ్యర్థుల గెలుపు ఓటములు మంగళవారం తేలిపోతాయి. తొలివిడత 141 పంచాయతీల్లో పోలింగ్.. కౌంటింగ్.. ఫలితా ప్రకటన, ఉప సర్పంచ్ ఎన్నిక అన్ని మంగళవారం జరగనున్నాయి. కాగా ఈ ఎన్నికల్లో తోడబుట్టిన అక్క చెల్లెల్లు బరిలోకి దిగడం ఆసక్తి కలిగిస్తుంది. ప్రకాశం జిల్లా కారంచేడు మండలంలోని కుంకలమర్రు గ్రామంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దాంతో ఇరు వర్గాల వారు ఇద్దరు అక్కా, చెల్లెళ్లను ఎంపిక చేశారు. ఒక వర్గానికి చెందిన వారు అక్క ఈదర రాజకుమారిని రంగంలో ఉంచితే, మరో వర్గం వారు ఆమె చెల్లెలు ఈదర సౌందర్యను బరిలోకి దించారు. దాంతో అక్కడ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ఈ ఇద్దరు ఇప్పటికే హోరాహోరీగా ప్రచారాలు కూడా చేశారు. ఇదిలా ఉంటే మరో వైపు కొండపి మండలం మిట్టపాలెంలో సర్పంచ్ స్థానానికి అన్నదమ్ములు బరిలోకి దిగారు. గ్రామంలో సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ అవడంతో ఆదివారం అన్నదమ్ములు బొడ్డు నరసింహం, బొడ్డు అంకయ్యలు నామినేషన్‌లు వేశారు. ఇప్పుడు ఈ అక్కాచెల్లెళ్లు అన్నతముళ్లలో ఎవరు గెలుస్తారన్నది మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :