Andhra Pradesh: కూటమి vs వైసీపీ.. స్థానిక ఎన్నికలపై ఎవరి వ్యూహం ఏంటీ?

ఏపీ రాజకీయాల్లో లోకల్ వార్ సైరన్ మోగనుంది. పంచాయతీ నుంచి మున్సిపాలిటీ వరకు పల్లె, పట్టణ పోరులో తమ సత్తా చాటేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. కూటమిగా ఉంటూనే క్షేత్రస్థాయిలో తమ పట్టు నిలుపుకోవాలని టీడీపీ, జనసేన, బీజేపీలు చూస్తుంటే.. ఎలాగైనా పట్టు సాధించి పుంజుకోవాలని వైసీపీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Andhra Pradesh: కూటమి vs వైసీపీ.. స్థానిక ఎన్నికలపై ఎవరి వ్యూహం ఏంటీ?
Ap Local Body Elections

Updated on: Sep 14, 2026 | 7:31 AM

ఏపీలో స్థానిక ఎన్నికలకు ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి. వచ్చే నెల చివరికల్లా స్థానిక ఎన్నికలు పూర్తి చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుండటంతో పార్టీలు కూడా కసరత్తు ముమ్మరం చేస్తున్నాయి. పార్టీలన్నీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఎవరికి వారు తమ సత్తా చాటాలని డిసైడ్‌ అయ్యాయి. కూటమిగా కలిసి పనిచేస్తూనే.. తమకు బలం ఉన్న ప్రాంతాల్లో పట్టు నిరూపించుకోవాలనే ఆలోచనలో పార్టీలు ఉన్నాయి. ఇదే సమయంలో.. బీజేపీ కూడా స్థానిక ఎన్నికలను అవకాశంగా చూస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో తన బలాన్ని చూపించాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది.

ఇటు జనసేన కూడా స్పీడ్‌ పెంచింది. గ్రామ పంచాయతీ నుంచి అసెంబ్లీ వరకు.. ఇప్పుడే స్కెచ్‌ మొదలుపెట్టింది. స్థానిక సంస్థ ఎన్నికల్లో కూటమి ధర్మం పాటిస్తూనే.. జనసేనకు బలం ఉన్న ప్రతి చోటా పోటీకి సిద్ధం కావాలని కమిటీలకు స్పష్టమైన టార్గెట్ ఇచ్చింది అధిష్టానం. ఈ క్రమంలోనే జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన కామెంట్స్ మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. బలం ఉన్న అన్ని చోట్లా పోటీ చేస్తాం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 50 నుంచి 60 స్థానాల్లో నిలబడేలా బలం పెంచుకుంటామనడం జనసేన నెక్స్ట్ ప్లాన్‌పై ఆసక్తిని పెంచింది.

ఇటు వైసీపీ కూడా లోకల్‌ వార్‌కు ముందుగానే గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేస్తోంది. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తోంది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో మాజీ మంత్రులు కన్నబాబు, అమర్‌నాథ్‌ పాల్గొని.. స్థానిక ఎన్నికలపై పార్టీ శ్రేణులతో చర్చించారు. విశాఖలో అత్యధిక స్థానాలు సాధిస్తామన్న ధీమాను వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. గతంలో విశాఖ మేయర్‌ పీఠాన్ని యాదవ మహిళకు కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. సామాజిక సమీకరణాలపైనా ఫోకస్‌ పెడుతున్నారు.

మొత్తంగా షెడ్యూల్‌ రాకముందే పార్టీలన్నీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మరి లోకల్‌ వార్‌లో ఎవరి బలం బయటపడుతుంది.. ఎవరి వ్యూహం వర్కౌట్‌ అవుతుందో చూడాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us