
చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారసత్వ భూమి రిజిస్ట్రేషన్‌ను కేవలం రూ.100 కే చేయాలని నిర్ణయం తీసుకుంది. రూ.10 లక్షల లోపు విలువ గల వారసత్వ ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం ఇకపై కేవలం రూ.100 మాత్రమే వసూలు చేయనున్నారు. అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌ను మరింత సులభతరం చేస్తూ కూటమి ప్రభుత్వం ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకుంది.. ఈ మేరకు ఏపీ రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మార్పులు చేసి, సాఫ్ట్‌వేర్ ను అప్డేట్ చేశారు. రూ.10 లక్షల లోపు విలువ గల వారసత్వ ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం రూ.100 మాత్రమే వసూలు చేసేలా ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇది మంగళవారం నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభించామని, కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
వారసత్వ ఆస్తుల విలువ రూ.10 లక్షలు దాటితే రిజిస్ట్రేషన్ కోసం రూ.1000 వసూలు చేయనున్నట్లు మంత్రి సత్యప్రసాద్ వివరించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.
కాగా.. చాలా ప్రాంతాల్లో వ్యవసాయ భూముల మార్కెట్ విలువ ఎకరం రూ.10 లక్షల లోపే ఉంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్లు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..