
జీవితం ఎంత విలువైనదో.. గౌరవప్రదమైన మరణం కూడా అంతే విలువైనదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతిమ దశలో చికిత్సకు స్పందించే అవకాశం లేని రోగులకు సంబంధించి కారుణ్య మరణాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలను రూపొందించింది. రోగి హక్కులు, కుటుంబ సభ్యుల నిర్ణయం, వైద్యుల బాధ్యత, న్యాయపరమైన పర్యవేక్షణ, ఈ నాలుగు అంశాలకు సమతుల్యం తీసుకొచ్చేలా రూపొందించిన ఈ మార్గదర్శకాలు ఏమిటి ఇప్పుడు చూద్దాం.
వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందినా.. కొన్ని వ్యాధుల ముందు వైద్యం కూడా చేతులెత్తేసే పరిస్థితులు ఉంటాయి. చికిత్స ఫలించదని స్పష్టమైనా.. కేవలం లైఫ్ సపోర్ట్ వ్యవస్థలపై రోజులు, నెలలు గడిపే రోగులు.. వారి బాధను చూస్తూ మానసిక వేదన అనుభవించే కుటుంబ సభ్యులు, మరోవైపు చట్టపరమైన భయాలతో నిర్ణయం తీసుకోలేని వైద్యులు. ఇలాంటి పరిస్థితులకు సుప్రీంకోర్టు ఇప్పటికే మార్గం చూపింది. ఇప్పుడు అదే తీర్పు అమలుకు ఏపీ ప్రభుత్వం విధివిధానాలు రూపొందించింది.
గౌరవప్రదమైన మరణం
రాజ్యాంగంలోని ఆర్టికల్-21 ప్రకారం గౌరవప్రదమైన జీవితం ఎంత ప్రాథమిక హక్కో.. గౌరవప్రదమైన మరణం కూడా అంతే ప్రాథమిక హక్కని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2018లో ఇచ్చిన తీర్పుకు 2023లో మరిన్ని స్పష్టతలు ఇస్తూ మార్గదర్శకాలను సవరించింది. అదే ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రక్రియను అమల్లోకి తీసుకువచ్చింది.
‘అడ్వాన్స్ డైరెక్టివ్’ అంటే ఏమిటి?
ఈ ప్రక్రియలో అత్యంత కీలకమైన అంశం ‘అడ్వాన్స్ డైరెక్టివ్’. పూర్తిగా స్పృహలో ఉన్న వ్యక్తి.. భవిష్యత్తులో తాను చికిత్సకు స్పందించని పరిస్థితి వస్తే.. తన తరఫున ఎవరు నిర్ణయం తీసుకోవాలి.. లైఫ్ సపోర్ట్‌పై ఏ నిర్ణయం తీసుకోవాలి అనే విషయాన్ని ముందుగానే రాతపూర్వకంగా నమోదు చేసుకోవచ్చు. దీనికి నోటరీ లేదా గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ తప్పనిసరి.
ఒక్క డాక్టర్ నిర్ణయం కాదు
రోగికి చికిత్స కొనసాగించడం వల్ల ప్రయోజనం లేదని ఒక్క వైద్యుడు నిర్ణయిస్తే సరిపోదు. ముందుగా చికిత్స అందిస్తున్న వైద్యుడితో పాటు మరో ఇద్దరు అనుభవజ్ఞులైన వైద్యులతో ప్రైమరీ మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో మరో సెకండరీ మెడికల్ బోర్డు కూడా స్వతంత్రంగా పరిశీలించాలి.
మేజిస్ట్రేట్‌కు సమాచారం తప్పనిసరి
రెండు మెడికల్ బోర్డులు అంగీకరించినా.. కుటుంబ సభ్యులు సమ్మతి తెలిపినా.. వెంటనే లైఫ్ సపోర్ట్ తొలగించే అవకాశం లేదు. ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌కు సమాచారం ఇచ్చిన తర్వాతే తదుపరి ప్రక్రియ కొనసాగుతుంది. అంటే ప్రతి దశలోనూ చట్టపరమైన పర్యవేక్షణ ఉంటుంది.
రోగి ముందుగా నిర్ణయం తీసుకోకపోతే?
ఒకవేళ రోగి ‘అడ్వాన్స్ డైరెక్టివ్’ ఇవ్వని పరిస్థితిలో.. కుటుంబ సభ్యులతో మాట్లాడి రెండు మెడికల్ బోర్డుల అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉంటే సంబంధిత వారు హైకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కూడా మార్గదర్శకాలు కల్పించాయి.
వైద్యులకు.. కుటుంబాలకు చట్టబద్ధ రక్షణ
ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు, కుటుంబ సభ్యులు చట్టపరమైన అనిశ్చితిని ఎదుర్కొనేవారు. ఇప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అన్ని దశలు పాటిస్తే.. వారి నిర్ణయాలకు చట్టబద్ధ రక్షణ లభిస్తుంది. అదే సమయంలో ప్రక్రియ దుర్వినియోగం కాకుండా కఠినమైన తనిఖీలు, బహుళస్థాయి ఆమోద వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు.
పటిష్ట పర్యవేక్షణ.. పూర్తి రికార్డులు
ఈ ప్రక్రియ అమలును డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్, జిల్లా వైద్యారోగ్య అధికారులు పర్యవేక్షిస్తారు. రోగికి సంబంధించిన ప్రతి నిర్ణయాన్ని రాతపూర్వకంగా నమోదు చేయాలి. మరణం తర్వాత కూడా మూడు సంవత్సరాల పాటు అన్ని రికార్డులను భద్రపరచాలి.
అనుమతి కాదు.. నియంత్రిత చట్టబద్ధ ప్రక్రియ
ఈ మార్గదర్శకాల ఉద్దేశం కారుణ్య మరణాలను విచ్చలవిడిగా అనుమతించడం కాదు. చికిత్సకు స్పందించే అవకాశం లేని, అంతిమ దశలో ఉన్న రోగుల విషయంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన కఠిన ప్రమాణాల ప్రకారం వైద్యులు, కుటుంబ సభ్యులు, న్యాయవ్యవస్థ భాగస్వామ్యంతో నిర్ణయం తీసుకునే ఒక చట్టబద్ధ ప్రక్రియను అమల్లోకి తీసుకురావడమే.
ఈ మార్గదర్శకాలతో అంతిమ దశలో ఉన్న రోగుల చికిత్సకు సంబంధించిన నిర్ణయాల్లో స్పష్టత రానుంది. రోగి గౌరవాన్ని కాపాడుతూనే.. వైద్యుల బాధ్యత, కుటుంబ సభ్యుల పాత్ర, న్యాయపరమైన పర్యవేక్షణ మధ్య సమతుల్యత తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఈ విధివిధానాల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.