Ramzan 2022: ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ముస్లిం ఉద్యోగులకు పని వేళల్లో వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో కార్యాలయాల నుంచి ముస్లిం ఉద్యోగులు గంట ముందుగా వెళ్లేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 3 నుంచి మే 2 వరకు అమల్లో ఉంటాయని ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులందరూ రంజాన్ మాసంలోని అన్ని పని దినాలలో సాయంత్రం ఒక గంట ముందుగా కార్యాలయాలు / పాఠశాలల నుంచి ఇళ్లకు వెళ్లడానికి అనుమతిచ్చింది.
ఇదిలాఉంటే.. తెలంగాణ ప్రభుత్వం కూడా అంతకుముందు రాష్ట్రంలోని ముస్లిం ఉద్యోగులకు పని వేళల్లో వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులు గంట ముందు ప్రభుత్వ కార్యాలయాల నుంచి వెళ్ళేందుకు అనుమతించింది.
కాగా.. ఇస్లామిక్ క్యాలెండర్‌లోని తొమ్మిదవ నెల రంజాన్ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దివ్య గ్రంథమైన పవిత్ర ఖురాన్ ఈ మాసంలోనే దివి నుంచి భువిపై అవతరించింది. దీనికి ప్రతీగా ఈ మాసంలో ఉపవాసాలను, దానధర్మాలను ఆచరిస్తారు. రంజాన్ మాసంలో సూర్యోదయానికి ముందు ముస్లింలు ఉపవాస దీక్షను ప్రారంభించి ప్రార్థనల్లో పాల్గొంటారు. సాయంత్రం సూర్యాస్తమయం అనంతరం ఉపవాస దీక్షను విరమిస్తారు.
Also Read: