ఏపీలో బయటపడ్డ మరో బంగారు గని.. రామగిరి గోల్డ్ మైన్స్ పునరుద్ధరణకు సర్కార్ సన్నద్ధం..!

ఆంధ్రప్రదేశ్ స్వరాంధ్రగా మారుతోంది. మరో బంగారు గని వెలుగులోకి వచ్చింది. రాయలసీమ ప్రాంతాన్ని దేశంలోనే అతిపెద్ద స్వర్ణ హబ్‌గా మార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే కర్నూలు జిల్లా జొన్నగిరిలో భారతదేశపు మొట్టమొదటి భారీ ప్రైవేట్ బంగారు గనిలో ఉత్పత్తి ప్రారంభమైంది. తాజాగా చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో బంగారు నిక్షేపాల అన్వేషణ, వేలం ప్రక్రియ వేగవంతం చేసింది.

ఏపీలో బయటపడ్డ మరో బంగారు గని.. రామగిరి గోల్డ్ మైన్స్ పునరుద్ధరణకు సర్కార్ సన్నద్ధం..!
Ramgiri Gold Mines

Updated on: Jul 15, 2026 | 7:50 PM

ఆంధ్రప్రదేశ్ స్వరాంధ్రగా మారుతోంది. మరో బంగారు గని వెలుగులోకి వచ్చింది. రాయలసీమ ప్రాంతాన్ని దేశంలోనే అతిపెద్ద స్వర్ణ హబ్‌గా మార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే కర్నూలు జిల్లా జొన్నగిరిలో భారతదేశపు మొట్టమొదటి భారీ ప్రైవేట్ బంగారు గనిలో ఉత్పత్తి ప్రారంభమైంది. తాజాగా చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో బంగారు నిక్షేపాల అన్వేషణ, వేలం ప్రక్రియ వేగవంతం చేసింది.

ఈ క్రమంలోనే శ్రీ సత్యసాయి జిల్లాలోని చారిత్రాత్మక రామగిరి గోల్డ్ మైన్స్ (బంగారు గనులు) పునఃప్రారంభానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి బుధవారం రామగిరి గోల్డ్ మైన్స్ పరిధిలోని ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కర్నూలు జిల్లా స్వర్ణగిరి తరహాలోనే రామగిరి గోల్డ్ మైన్స్‌ను కూడా అత్యాధునిక సాంకేతికతతో త్వరలోనే తిరిగి ప్రారంభిస్తామని మంత్రి ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు.

గనుల పరిశీలన అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో అపారమైన ఖనిజ సంపద ఉందని, వాటిని సద్వినియోగం చేసుకొని రాష్ట్రానికి ఆదాయం తేవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. “కర్నూలు జిల్లా జొన్నగిరి మైనింగ్‌లో ఒక టన్ను మట్టిని ప్రాసెస్ చేస్తే ఒక గ్రాము బంగారం వస్తోంది. కానీ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం రామగిరి గోల్డ్ మైన్స్‌లో టన్ను మట్టికి ఏకంగా 4 గ్రాముల బంగారం లభించే అవకాశం ఉంది. 416 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ గనులపై ఇప్పటికే సర్వేలు పూర్తయ్యాయి. త్వరలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో టెండర్లు పిలిచి మైనింగ్ పనులు ప్రారంభిస్తాం” అని మంత్రి స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా చిగురుగుంటతో పాటు రాష్ట్రంలో మరో మూడు ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలను గుర్తించినట్లు ఆయన వెల్లడించారు.

గత వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలోని మైనింగ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి రవీంద్ర ధ్వజమెత్తారు. ఓబుళాపురం మైనింగ్ దోపిడీపై విచారణ ఓ కొలిక్కి వస్తోందని, త్వరలోనే అక్కడ కూడా మైనింగ్ ప్రారంభిస్తామన్నారు. రామగిరి గోల్డ్ మైన్స్ పరిధిలో వైసిపి హయాంలో జరిగిన ఖనిజ సంపద దోపిడీపై సమగ్ర విచారణకు ఆదేశిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు.

ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ.. భారత్ గోల్డ్ మైన్స్ గడువు 2002తో ముగిసిపోయిన తర్వాత ఇక్కడి కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. గతంలో టిడిపి హయాంలోనే ఈ గనులను తెరిచేందుకు గట్టి ప్రయత్నాలు జరిగాయని, అయితే ఆ తర్వాత వచ్చిన వైసిపి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని మండిపడ్డారు. వైసిపి నేతలు ఇక్కడి నుంచి ఏకంగా వెయ్యి టిప్పర్ల బంగారు ఖనిజం ఉన్న మట్టిని అక్రమంగా తరలించి అమ్ముకున్నారని సునీత ఆరోపించారు. జొన్నగిరి కంటే రామగిరిలోనే నాణ్యమైన బంగారం నిక్షేపాలు ఉన్నందున, స్థానిక నిరుద్యోగులకు, కార్మిక కుటుంబాలకు ఉపాధి లభించేలా ఈ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని పరిటాల సునీత మంత్రి కొల్లు రవీంద్రను కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో రామగిరి ప్రాంత ప్రజల్లో సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us