
మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రెండో ఏడాది కూడా ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద నిధులు విడుదల చేయడంతో గంగపుత్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రభుత్వానికి తమ కృతజ్ఞతలు చెప్పేందుకు వెంకటపాలెం, తుమ్మలపాలెం, సీతానగరం, కుమ్మరపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకారులు సుమారు వంద బోట్లతో కృష్ణానది గుండా ముఖ్యమంత్రి నివాసానికి తరలివచ్చారు. కృష్ణమ్మ ఒడిలో వందలాది పడవలు ఒకేసారి కదలివస్తుంటే అమరావతి తీరం సరికొత్త శోభను సంతరించుకుంది.

సీఎం ఇంటి వైపు వస్తున్న పడవలను గమనించిన విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. మత్స్యకారులకు స్వయంగా అభివాదం చేస్తూ.. వారందరినీ తన నివాసంలోకి ఆహ్వానించారు. ప్రజాప్రభుత్వంలో సామాన్యులకు దక్కిన గౌరవానికి ఇది నిదర్శనంగా నిలిచింది.

మత్స్యకారులను ఇంట్లో కూర్చోబెట్టుకుని, వారి యోగక్షేమాలను లోకేష్ ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. యువగళం పాదయాత్రలో జువ్వలదిన్నె వద్ద మత్స్యకారులు తనకు చూపిన ప్రేమాభిమానాలను, వారి ఐకమత్యాన్ని ఈ సందర్భంగా లోకేష్ కొనియాడారు. ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వం మత్స్యకారుల సొంతమన్నారు.

గత వైసీపీ పాలనలో రాష్ట్రం ఎంత ధ్వంసమైందో.. మత్స్యకారులు ఎంత ఇబ్బంది పడ్డారో మనమంతా చూశామని.. కంపెనీలు వెళ్ళిపోయాయన్నారు. కానీ మన కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తూనే సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. మత్స్యకారుల కష్టాలు తనకు తెలుసని.. మీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రపంచ దేశాలు తిరిగి ఐటీ, డిఫెన్స్ కంపెనీలను తెస్తున్నామన్నారు.

జువ్వలదిన్నెలో రాబోయే సాగర్ డిఫెన్స్ కంపెనీ ద్వారా తమిళ జాలర్ల చొరబాటును అరికట్టేందుకు 'అటానమస్ పెట్రోలింగ్ బోటు'ను కూడా తీసుకువస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. మీ అందరికీ ఏ కష్టం వచ్చినా.. ఈ లోకేష్ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని నారా లోకేష్ మత్స్యకారులకు భరోసా ఇచ్చారు.

కేవలం నిధులు ఇవ్వడమే కాకుండా.. తమను ఇంటికి పిలిచి గౌరవించిన మంత్రి లోకేష్ ఆత్మీయతకు మత్స్యకారులు ముగ్ధులయ్యారు. మత్స్యకారుల పిల్లల చదువులకు, ఉద్యోగాలకు భరోసా ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సాయం, మంత్రి చూపిన ఆదరణ తమలో కొత్త నమ్మకాన్ని నింపాయని గంగపుత్రులు ఆనందంగా చెప్తున్నారు.