Balineni Srinivasulu Reddy: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపుతో మెట్టు దిగిన బాలినేని.. అంతా సర్ధుకున్నట్లేనా..?

| Edited By: Balaraju Goud

Jan 18, 2024 | 6:17 PM

ఒంగోలు వైసీపీ సీటుపై క్లారిటీ వచ్చేసినట్టేనా..! నెలరోజులుగా అలక వహించి హైదరాబాద్‌లో ఉన్న బాలినేని ముఖ్యమంత్రితో భేటీ అనంతరం సమస్య కొలిక్కి వచ్చిందా..? వైఎస్ జగన్‌తో బాలినేని భేటీలో అసలు ఏం జరిగింది..? తన సీటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సీఎం ఒంగోలు ఎంపీ సీటు కోసం మాగుంట పేరును ప్రస్తావించిన బాలినేనికి ఏం సమాధానం చెప్పారు..? ఇంతకీ ఎవరు ఎక్కడెక్కడ పోటీ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది..?

Balineni Srinivasulu Reddy: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపుతో మెట్టు దిగిన బాలినేని.. అంతా సర్ధుకున్నట్లేనా..?
Balineni Srinivasulu Reddy Ys Jagan Mohan Reddy
Follow us on

ఒంగోలు వైసీపీ సీటుపై క్లారిటీ వచ్చేసినట్టేనా..! నెలరోజులుగా అలక వహించి హైదరాబాద్‌లో ఉన్న బాలినేని ముఖ్యమంత్రితో భేటీ అనంతరం సమస్య కొలిక్కి వచ్చిందా..? వైఎస్ జగన్‌తో బాలినేని భేటీలో అసలు ఏం జరిగింది..? తన సీటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సీఎం ఒంగోలు ఎంపీ సీటు కోసం మాగుంట పేరును ప్రస్తావించిన బాలినేనికి ఏం సమాధానం చెప్పారు..? ఇంతకీ ఎవరు ఎక్కడెక్కడ పోటీ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.. ప్రస్తుతం ఒంగోలులో ఇటు వైసీపీ, అటు తెలుగుదేశం పార్టీలో ఇదే హాట్‌ టాపిక్‌..

ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డితో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి తాజా భేటీ వ్యవహారంలో ఏం జరిగిందన్న దానిపై ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయ నేతల్లో తీవ్ర చర్చకు దారితీసిందట. నెల రోజులుగా అలక పాన్పు ఎక్కి హైదరాబాద్‌కు వెళ్ళిపోయిన బాలినేనికి వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ కలవాలంటూ సీఎంవో నుంచి ఫోన్‌ రావడంతో ఎట్టకేలకు బాలినేని ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. తన కుమారుడు బాలినేని ప్రణీత్‌రెడ్డితో కలిసి వెళ్ళిన బాలినేని జగన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారట. ఈ సమావేశంలో ముఖ్యంగా ఒంగోలులో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు కోసం పెండింగ్‌లో ఉన్న నిధులు విడుదల చేసే విషయంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదిరిందట. ఒంగోలులో 24 వేల మందికి పట్టాల పంపిణీకి భూమి కొనుగోలు కోసం పెండింగ్ ఉన్న రూ. 180 కోట్లు విడుదల చేసేందుకు సీఎం అంగీకరించారట. ఆ తరువాత జీవో కూడా విడుదల చేశారు. ఇప్పటికే రూ. 30 కోట్లు భూ యజమానులకు చెల్లించిన ప్రభుత్వం.. మిగిలిన రూ. 180 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

పేదలకు పట్టాలు పంపిణీ చేసిన తర్వాతే ఒంగోలు నుంచి పోటీ చేస్తానని గతంలోనే బాలినేని ప్రకటించిన సంగతి తెలిసిందే… ఎట్టకేలకు పట్టాల పంపిణీకి భూమి కొనుగోలు కోసం నిధులు విడుదల కావడంతో బాలినేని ఒంగోలు నుంచి పోటీచేసేందుకు మార్గం సుగమమైంది. అయితే బాలినేనిని గిద్దలూరు నుంచి పోటీ చేస్తే గెలుపు సునాయాసంగా ఉంటుందని గతంలోనే సీఎం జగన్‌ సూచించిన మేరకు తాజా పరిస్థితుల్లో ఒంగోలు నుంచి పోటీ చేయాలా.. లేక గిద్దలూరుకు వెళ్ళాలా అనేది బాలినేని నిర్ణయానికే వదిలేశారట.

అంత వరకు బాగానే జరిగిందట. ఇక ప్రధానంగా బాలినేని మరో డిమాండ్‌గా ఉన్న ఒంగోలు వైసీపీ ఎంపీ సీటు మాగుంటకు కేటాయించాలని సీఎంకు విన్నవించారట. అయితే మాగుంట విషయంలో వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించలేదని తెలిసింది. దీంతో ఒంగోలు వైసీపీ సీటు మాగుంటకు నిరాకరించినట్టే కనిపిస్తోంది. తాజా పరిణామాల నేపద్యంలో ఒంగోలు వైసీపీ ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అధిష్టానం ఖరారు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట.

జగన్‌కు బంధువే… అయినా తప్పని హైడ్రామా…

వైసీపీ పార్టీలో నిన్నటి వరకు కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి కొంతకాలం నుంచి రాజకీయంగా తనను పక్కన పెట్టారన్న భావనతో ఉన్నారట. అందుకే ఇటీవల కాలంలో పార్టీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. సంక్రాంతికి ముందు వారం రోజుల క్రితం బాలినేని సీఎం అపాయింట్‌మెంట్‌ కోసం విజయవాడలో వేచి చూశారు. అయితే సీఎం జగన్‌ను కలిసే అవకాశం రాకపోవడంతో, మనస్తాపానికి గురైన బాలినేని ఒంగోలుకు రాకుండానే హైదరాబాద్‌కు వెళ్ళిపోయారు. ఆ తర్వాత జనవరి 12వ తేదీన జిల్లాలో జరిగిన కొండపి, సంతనూతలపాడు సమావేశాలకు బాలినేని రావాలని ఆ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి ఆహ్వానించినా, బాలినేని జిల్లాకు రాలేదు. బాలినేని అనుచరులు కూడా ఈ రెండు సమావేశాలకు గైర్హాజరయ్యారు.

కొండపి ఇన్‌చార్జిగా ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్‌, సంతనూతలపాడు ఇన్‌చార్జిగా ఉన్న మంత్రి మేరుగు నాగార్జున ఇద్దరూ తమకు బాలినేని మద్దతు లేకపోతే నియోజకవర్గాల్లో గెలుపు సాధ్యం కాదన్న భావనతో అధిష్టానంపై బాలినేని జోక్యం చేసుకునేలా ఒప్పించాలని ఒత్తిడి తెస్తున్నారట. ఈ పరిస్థితుల్లో అసంతృప్తితో హైదరాబాద్‌లో ఉన్న బాలినేనికి ఎట్టకేటకు సీఎంవో నుంచి ఫోన్ రావడంతో ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. ఈ సమావేశంలో తనకు అనుకూలంగానే అన్నీ జరిగినా, ఒంగోలు ఎంపీ విషయంలో తాను చెప్పినట్టు జరగలేదన్న అసంతృప్తితోనే బాలినేని వెనుతిరిగారట. సీఎంవో కార్యాలయం బయట వేచి ఉన్న విలేకరులతో మాట్లాడకుండానే మరో ద్వారం గుండా విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడ మిగిలిన విషయాలపై సుదీర్ఘంగా చర్చించారట.

బాలినేని సూచనలపై విజయసాయితో చర్పోపచర్చలు…

ప్రకాశం జిల్లాలో వైసీపీ అభ్యర్దుల ఎంపికపై ఇప్పటికే కొన్ని మార్పులు చేసిన అధిష్టానం… ఈ విషయంలో తన సూచనలు పరిగణలోకి తీసుకోలేదన్న అసంతృప్తితో బాలినేని ఉన్నారట. కొండపి నియోజకవర్గానికి మంత్రి ఆదిమూలపు సురేష్‌ను, అలాగే సంతనూతలపాడుకు మంత్రి మేరుగు నాగార్జునను ఇన్‌చార్జిగా నియమించే విషయంలో తనను సంప్రదించలేదన్న ఆవేదన వెలిబుచ్చారట. ఇక మిగిలిన అభ్యర్ధుల ఎంపికలో అయినా తాను సూచించిన అభ్యర్దులకే ప్రాధాన్యమివ్వాలని బాలినేని పట్టుపడుతున్నారట. ఇప్పటి వరకూ అభ్యర్దులు ఖరారు కాని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై బాలినేని తన అభిప్రాయాలను విజయసాయితో చర్చించాలని సీఎం స్వయంగా సూచించడంతో ప్రస్తుతం మార్పులు, చేర్పులపై చర్చలు నడుస్తున్నాయని సమాచారం. ఇదే విషయంపై నేడో, రేపో నిర్ణయం తీసుకుంటారట.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యేలు, మరికొందరు ఇన్‌చార్జిలకు తాడేపల్లి రావాలని ముఖ్యమంత్రి కార్యాలయం పిలిపించనుందట. అభ్యర్ధులు ఇంకా ఖరారు కాని కనిగిరి, మార్కాపురం ఎమ్మెల్యేలను కూడా తాడేపల్లి రావాలని కోరినట్లు సమాచారం. ఇప్పటికే ఒంగోలులో ఎంపీ అభ్యర్ధిగా ఈసారి మాగుంటకు చాన్స్‌ లేదని చెప్పిన అధిస్టానం.. ఒంగోలు ఎంపీ అభ్యర్ధి విషయంలో కూడా నిర్ణయం తీసుకోనుందని తెలిసింది. ప్రకాశంజిల్లా అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఎట్టకేలకు బాలినేని సూచనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని అధిష్టానం భావించడంతో, బాలినేని అలకల ఎపిసోడ్‌కు ఇక ఎండ్‌ కార్డ్‌ పడినట్టేనని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు…

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…