CBN Priority: ఏపీ సీఎంగా చంద్రబాబుపై భారీ అంచనాలు.. 4.0లో అత్యంత ప్రాధాన్యత వీటికే..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4.0లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన అంశాల్లో మొదటిది అమరావతి నిర్మాణమైతే రెండోది పోలవరం పూర్తి.. ఆ తర్వాత ఉపాధి కల్పన.. ఎన్నికల ప్రచారంలో సైతం ఈ మూడు అంశాలపైనే చంద్రబాబు ప్రచారం సాగింది. అందుకే ఇప్పుడు ఈ మూడు శాఖలకు మంత్రుల కేటాయింపులోనూ చంద్రబాబు ఆచితూచి అడుగులు వేశారు.

CBN Priority: ఏపీ సీఎంగా చంద్రబాబుపై భారీ అంచనాలు.. 4.0లో అత్యంత ప్రాధాన్యత వీటికే..!
Nara Chandrababu

Updated on: Jun 14, 2024 | 5:16 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4.0లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన అంశాల్లో మొదటిది అమరావతి నిర్మాణమైతే రెండోది పోలవరం పూర్తి.. ఆ తర్వాత ఉపాధి కల్పన.. ఎన్నికల ప్రచారంలో సైతం ఈ మూడు అంశాలపైనే చంద్రబాబు ప్రచారం సాగింది. అందుకే ఇప్పుడు ఈ మూడు శాఖలకు మంత్రుల కేటాయింపులోనూ చంద్రబాబు ఆచితూచి అడుగులు వేశారు.

చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్ట్ రాజధాని అమరావతి

అమరావతి అనేది చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్ట్. ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించాలని మొదటి నుంచీ చంద్రబాబు కలలు కన్నారు. ఈ రాజధాని నిర్మాణం మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ కిందకు వస్తుంది. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖా మంత్రిగా పనిచేసిన పొంగూరు నారాయణ సైతం.. రాజధాని మాస్టర్ ప్లాన్‌లో తనవంతు పాత్ర పోషించారు. ఇప్పుడు మళ్లీ అదే నారాయణకు పట్టణాభివృద్ధి శాఖను సీఎం చంద్రబాబు అప్పగించారు. అమరావతికి చంద్రబాబు ఎంత ప్రధాన్యతను ఇస్తున్నారనేది దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది.

ఏపీకి జీవనాడి పోలవరం

నీటిపారుదలశాఖను మంత్రి నిమ్మలరామానాయుడికి చంద్రబాబు అప్పగించారు. ఏపీకి జీవనాడి.. రాష్ట్రంలో అత్యంత వేగవంతంగా పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ పోలవరం. ఈ పోలవరం నిర్మాణ బాధ్యతలను మంత్రి నిమ్మల రామానాయుడికి చంద్రబాబు అప్పగించారు. దీని వెనుక బలమైన కారణమే ఉంది. పోలవరాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటూ నిమ్మలరామానాయుడు అప్పట్లో పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అనేకసార్లు ప్రెస్‌మీట్లు పెట్టి మరీ అప్పటి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇప్పుడు అదే పోలవరాన్ని రామానాయుడికి చంద్రబాబు అప్పగించారు. పోలవరంపై పూర్తి అవగాహన ఉండటంతో పాటు ఆయన పోరాటాన్ని దృష్టిలో పెట్టుకుని రామానాయుడికి ఈ శాఖ అప్పగించినట్టు తెలుస్తోంది.

బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ

చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చే అంశాల్లో మరో కీలకమైనది ఉపాధి కల్పన. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో టీడీపీ విడుదల చేసిన సూపర్ సిక్స్ పథకాల్లో ఇదీ ఒకటి. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని ప్రతి మీటింగ్‌లో చంద్రబాబు స్పష్టం చేశారు.
అందులో భాగంగానే ఈ శాఖకు కూడా ఇప్పుడు చంద్రబాబు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారు. గతంలో ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రిగా అనుభవం ఉన్న లోకేష్‌కి ఈ సారి ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. మానవ వనరుల అభివృద్ధి, యువతకు నైపుణ్య శిక్షణ లాంటి విభాగాలకు లోకేష్ అయితేనే కరెక్ట్ అని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.

చంద్రబాబు మరో నినాదం అభివృద్ధి

మౌళిక వసతులు కల్పించి, పెట్టుబడులు తీసుకొస్తే రాష్ట్రం దానంతట అదే అభివృద్ధి చెందుతుంది. ఆదాయం ఘననీయంగా పెరుగుతుంది. తద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు జరుగుతుందనేది చంద్రబాబు ఆలోచన. అందుకే చంద్రబాబు 4.0లో ఈ శాఖకు కూడా అత్యంత ప్రాధాన్యత ఉండబోతుందనే చెప్పాలి. ఈ బాధ్యతలను కర్నూలు జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్థన్‌రెడ్డికి అప్పగించారు సీఎం చంద్రబాబు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…