AP Capital: త్వరలోనే పకడ్భందీగా ఏపీ రాజధాని బిల్లు.. మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు!

|

Nov 22, 2021 | 7:07 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతానికి ఏపీ రాజధాని ఏదీ అనే చర్చ మరోసారి మొదలైంది. ఇదే అంశంపై ఏపీ పురపాలన శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.

AP Capital: త్వరలోనే పకడ్భందీగా ఏపీ రాజధాని బిల్లు.. మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు!
Botsa Satyanarayana
Follow us on

Botsa Satyanarayana on AP Capital: ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామం జరిగింది. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ఏర్పాటుకు సిద్ధమైన వైసీపీ ప్రభుత్వం దానికి సంబంధించిన బిల్లులను ఉపసంహరించుకుంది. న్యాయమైరమైన ఇబ్బందులు, కోర్టు కేసులతో ఆలస్యం కావడం, అమరావతి రైతులు, ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఎవరూ ఊహించని విధంగా ఆ బిల్లులను రద్దు చేసింది. ఏపీ మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లును వెనక్కి తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి అసెంబ్లీలో ప్రకటన కూడా చేసింది. త్వరలోనే మరింత సమగ్రంగా, సవివరంగా మరో బిల్లును తీసుకొస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.

అయితే, సీఎం జగన్ చేసిన ఈ ప్రకటనతో రాష్ట్రంలో మరింత కన్ఫ్యూజన్ మొదలైంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతానికి ఏపీ రాజధాని ఏదీ అనే చర్చ మరోసారి మొదలైంది. ఇదే అంశంపై ఏపీ పురపాలన శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. అసెంబ్లీ ముగిసిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఏపీ రాజధాని అమరావతేనా అనే ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వలేదు. అమరావతి అనేది కేంద్రం ప్రచురించిన జియోలాజికల్ సర్వేలో కూడా లేదని వ్యాఖ్యానించారు. అమరావతిని అభివృద్ధి చేయాలనే ఆలోచన తమకు కూడా ఉందని, అలాగే13 జిల్లాలు సమగ్రంగా అభివృద్ధి చెందాల్నదే మా లక్ష్యమన్నారు. మూడు రాజధానులపై టీడీపీ కావాలనే దుష్ప్రచారం చేసిందని ధ్వజమెత్తారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు.. కనీసం కరకట్టుకు సరైన రోడ్డు కూడా వేయలేదని విమర్శించారు. చిత్తశుద్ధితోనే మూడు రాజధానులపై నిర్ణయాన్ని తీసుకున్నామని, మంచి నిర్ణయం తీసుకున్నా.. టీడీపీ కావాలనే అపోహలు సృష్టించిందని మండిపడ్డారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల మనోభావాలు, ఇతర ముఖ్యమంత్రుల కాలంలో వేసిన మంత్రుల కమిటీ అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకొని సీఎం వైఎస్‌ జగన్‌ మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నారని స్పష్టం చేశారు. త్వరలోనే వికేంద్రీకణకు సంబంధించి పూర్తి స్థాయి బిల్లుతో ప్రజల ముందుంటామన్నారు. ఏపీ రాజధాని ఏదీ అనేది త్వరలోనే చెబుతామన్నారు. అసలు పదేళ్లపాటు హైదరాబాద్ ఏపీకి ఉమ్మడి రాజధానిగా ఉండే అవకాశం ఉన్నా.. చంద్రబాబు ఎందుకు తిరిగొచ్చారని ఆయన ప్రశ్నించారు. అటు, అమరావతే ఏపీ రాజధానిగా ఉండాలన్న బీజేపీ వాదనను మంత్రి బొత్స తప్పుబట్టారు. రాజ్యాంగంలో ఇదే రాజధాని అని ఎక్కడైనా ఉందా ? అని ప్రశ్నించారు. అసలు బీజేపీకి ఈ రాష్ట్రంలో ఎలాంటి స్థానం లేదని వ్యాఖ్యానించారు.

ఇదిలావుంటే, అమరావతి రైతులకు గత ప్రభుత్వం ఇస్తామన్న, అన్నీ సదుపాయాలను ఇస్తున్నామని.. కానీ, అన్నీ తాము అనుకున్నట్టు, కోరుకున్నట్టు జరగాలంటే కుదరదని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల విషయంలో తాము వెనక్కి తగ్గలేదని.. పలువురికి ఉన్న అపోహలు, సందేహాలు తొలగించేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ప్రతిపక్షాలు ఈ విషయంలో అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నాయని మంత్రి బొత్స ఆరోపించారు.

Read Also… Mustache hair Suit: మీకు మీసాలతో చేసిన సూట్ గురించి తెలుసా.? వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం!