పిడుగులు, ఈదురుగాలుల ముప్పు.. వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోండి..
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, కర్ణాటక-తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వాతావరణం మారింది. రాగల మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, కర్ణాటక-తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీనికితోడు ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. బీహార్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఆదివారం కొనసాగిన ఉత్తర-దక్షిణ ద్రోణి బలహీనపడగా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాం పరిధిలోని దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది.
ప్రాంతాల వారీగా 3 రోజుల వాతావరణ సూచన
కోస్తాంధ్ర – యానాం
రాగల మూడు రోజుల పాటు అక్కడక్కడా ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కి.మీ., గరిష్ఠంగా 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
రాయలసీమ
రాగల మూడు రోజుల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. గంటకు 30 నుంచి 40 కి.మీ., గరిష్ఠంగా 50 కి.మీ. వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
తెలంగాణలో పరిస్థితి ఇలా
ప్రస్తుతం దేశంలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ ఊపందుకుంది. దీని ప్రభావంతో తెలంగాణలో రాగల రెండు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్లుండి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
ప్రజలు, రైతులకు సూచనలు
వర్షంతో పాటు ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, వ్యవసాయ కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండవద్దని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు బలమైన గాలుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మూడో రోజు నుంచి రాష్ట్రంలో వర్షాలు తగ్గి పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.
