killed by pubg game: ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటుపడి చాలా మంది యువకులు అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా చిత్తూర్ జిల్లాలో పబ్‌జీ గేమ్‌కి బానిసైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల చైనాతో సరిహద్దు నేపథ్యంలో భారత ప్రభుత్వం కొన్ని చైనా యాప్స్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అలాగే పబ్‌జీని సైతం నిషేధించాలని చాలామంది తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం పబ్‌జీని బ్యాన్ చేసిందని అందురు అనుకున్నారు. కానీ అది పూర్తిగా జరగలేదు. పబ్‌జీని పోలిన గేమ్ ఆన్‌లైన్‌లో కోకొల్లలుగా ఉన్నాయి. దీంతో యువత రాత్రి పగలు తేడాలేకుండా వాటితో సమయం గడుపుతున్నారు.
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పచ్చికాపలంకు చెందిన యోగేష్ అనే 22 ఏళ్ల యువకుడు నిత్యం పబ్‌జీ గేమ్ ఆడేవాడు. లాక్‌డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన యోగేశ్ నిత్యం ఈ గేమ్ ఆడుతూ దానికి బానిసయ్యాడు. అంతేకాకుండా తన బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.రెండు లక్షలు పోగొట్టుకొన్నాడు. ఇంట్లో వారికి డబ్బుల విషయం ఎలా చెప్పాలో తెలియక తనలో తాను కుమిలిపోయాడు. చివరకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా గుర్తించిన కుటుంబ సభ్యులు తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.