Goutham Reddy: నెల్లూరుకు ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పార్ధీవదేహం.. రేపు ఉదయగిరిలో అంత్యక్రియలు

ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం షాక్ నుంచి ఇంకా తెలుగు ప్రజలు తేరుకోలేదు. ఆయన అభిమానులు, దుఖఃసాగరంలో మునిగారు. అటు గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు నెల్లూరు జిల్లా నేతలు.

Goutham Reddy: నెల్లూరుకు ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పార్ధీవదేహం.. రేపు ఉదయగిరిలో అంత్యక్రియలు
Mekapati

Updated on: Feb 22, 2022 | 8:25 AM

Mekapati Goutham Reddy Funerals: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం షాక్ నుంచి ఇంకా తెలుగు ప్రజలు తేరుకోలేదు. ఆయన అభిమానులు, దుఖఃసాగరంలో మునిగారు. అటు గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు నెల్లూరు(Nellore) జిల్లా నేతలు. సోమవారం గుండెపోటుతో మరణించిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు నెల్లూరు జిల్లా ఉదయగిరి(Udayagiri)లోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించనున్నారు. ముందు.. స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహించాలని భావించారు. ఆ తర్వాత ఉదయగిరిలోని వారి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌ కాలేజీ వద్దకు మార్చారు.

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి గుండెపోటుతో మరణించారన్న వార్త అందరినీ షాక్‌కు గురిచేసింది. గుండెనొప్పితో సోఫాలో కుప్పకూలిన గౌతమ్‌ రెడ్డిని, ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచారని చెప్పారు వైద్యులు. దీంతో ఆయన కుటుంబం, స్నేహితులు, అభిమానులు, సహచరులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అటు బుధవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నెల్లూరు జిల్లా నేతలు, అధికారులు. మరి కాసేపట్లో నెల్లూరులోని ఇంటికి గౌతంరెడ్డి పార్థీవదేహాన్ని తీసుకురానున్నారు. అక్కడే ప్రజల సందర్శనార్థం ఉంచుతామని నేతలు చెప్పారు. రేపు ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఉదయగిరి మెరిట్ ఇంజినీరింగ్ ప్రాంగణంలో, అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు.

రేపు ఉదయం 11గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గౌతమ్ రెడ్డి పార్థీవ దేహాన్ని ఇవాళ ఉదయం నెల్లూరుకి ఎయిర్‌ అంబులెన్స్‌లో తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరికాసేపట్లో ఉదయం 8.30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు గౌతమ్ రెడ్డి భౌతిక కాయం తరలించనున్నారు. అక్కడ నుంచి ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుండి 11 గంటలకు నెల్లూరులోని నివాసానికి తీసుకువస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాప్టర్‌లో గౌతమ్ రెడ్డి పార్థివ దేహం తరలిస్తారు..హెలికాప్టర్ లో గౌతమ్ రెడ్డి పార్థివ దేహంతో పాటు తల్లి, భార్య ప్రయాణిస్తారని కుటుంబసభ్యులు తెలిపారు.

ప్రజల సందర్శనార్థం నెల్లూరులోని మేకపాటి గెస్ట్‌ హౌస్‌లో గౌతమ్‌ రెడ్డి పార్థివ దేహాన్ని ఉంచుతారు. ఆ తర్వాత ఉదయం గౌతమ్ రెడ్డి పార్ధీవదేహన్ని అక్కడి నుంచి ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీకి తరలిస్తారు. అక్కడే ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. గౌతమ్‌రెడ్డి కుమారుడు విదేశాల్లో ఉన్నారు. ఆయన ఇవాళ సాయంత్రం వచ్చే అవకాశం ఉంది. ఆయన వచ్చిన తర్వాత ఉదయగిరిలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. గౌతమ్‌రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి అమెరికా నుంచి బయల్దేరారు. నేరుగా చెన్నై చేరుకొని అక్కడి నుంచి నెల్లూరు వస్తారు క్రిష్ణార్జున్‌ రెడ్డి. గౌతమ్‌రెడ్డి మంత్రి హోదాలో ఉండి మరణించటంతో, రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.

Read Also…  News Watch: ఆ రెండు సంఘటనలు చాలు గౌతమ్ రెడ్డి ‘లీడర్’ అని చెప్పడానికి.. వీడియో