గుంటూరు జిల్లా పెదకాకాని వేదికగా జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశాలను (YCP Plenary Meetings) ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. వైసీపీ ప్లీనరీ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని, జగన్‌ను పొగడడానికే ప్లీనరీ సరిపోయిందని టీడీపీ విమర్శించింది. వైసీపీ శ్రేణులు ధీరుడు, శూరుడు అంటోన్న జగన్ దమ్ము౦టే పరదాలు లేకుండా అమరావతిలో తిరగాలని డిమాండ్ చేశారు. రెండు వేల మ౦ది పోలీసులు లేకు౦డా సెక్రటేరియట్ కి వెళ్లి సీట్లో కూర్చోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత (TDP Leader Anitha) సవాల్ విసిరారు. అది పార్టీ ప్లీనరీనా లేక విజయమ్మ వీడ్కోలు సభా? అని ప్రశ్నించారు. ప్లీనరీలో జగన్‌ను పొగడటం, చంద్రబాబును తిట్టడం తప్ప ప్రజలకు ఉపయోగపడే తీర్మానాలు ఏమైనా చేశారా అని నిలదీశారు. వైసీపి ప్లీనరీ సమావేశాలు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ప్లీనరీలో ఒకరు సింహాలు అంటే మరొకరు పులులు అంటారు. ప్లీనరీ పెద్ద గుడారాలు వేసి సర్కస్ నిర్వహించిట్టు ఉందని ఎద్దేవా చేశారు. వ్యక్తిగత విమర్శలు ఎప్పుడూ సమాజానికి శ్రేయస్కరం కాదని హితవు పలికారు.
గుంటూరు (Guntur) జిల్లా పెదకాకానిలో రెండురోజులుగా కొనసాగిన వైసీపీ (YCP) ప్లీనరీ ముగిసింది. తొలిరోజు నాలుగు రంగాలపై తీర్మానాలు ఆమోదించిన వైసీపీ.. రెండు రోజు మరో ఐదు తీర్మానాలు ఆమోదించింది. పారదర్శక పాలన, వ్యవసాయ రంగం, సామాజిక న్యాయం, దుష్ట చతుష్టయంపై ప్లీనరీ తీర్మానాలు చేసింది. శుక్రవారం జరిగిన తొలిరోజు ప్లీనరీలో.. మహిళ సాధికారత , దిశ చట్టం.. విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు.. పథకాలు అమలుపై ప్లీనరీ తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం జగన్ 90 (CM Jagan) నిమిషాలు సాగిన తన ప్రసంగంలో తమ ప్రభుత్వం గడిచిన మూడేళ్లుగా చేపట్టి అభివృద్ధి, సంక్షేమ పథకాలు, గడిచిన మూడేళ్ల తమ పాలన గురించి మాట్లాడారు. పథకాలు అమలు తీరుతెన్నులను ప్రస్తావించారు.