AP CS Sameer sharma: పీఆర్సీ, ఉద్యోగుల ఆందోళనపై ఏపీ సీఎస్ సమీర్ శర్మ కీలక వ్యాఖ్యలు!

|

Jan 19, 2022 | 5:54 PM

AP CS on PRC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మూడు పీఆర్సీ జీవోలపై ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. దీంతోె వివరణ ఇచ్చారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ.

AP CS Sameer sharma: పీఆర్సీ, ఉద్యోగుల ఆందోళనపై ఏపీ సీఎస్ సమీర్ శర్మ కీలక వ్యాఖ్యలు!
Ap Cs Sameer Sharma
Follow us on

AP CS Sameer Sharma on Pay Revision: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల కొత్త వేతన సవరణపై ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఆరోపణలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ స్పందించారు. ఏ ఒక్క ఉద్యోగి గ్రాస్ శాలరీ ప్రభుత్వం తగ్గించ లేదని ఆయన స్పష్టం చేశారు. పదేళ్ల నుండి పీఆర్సీ గురించి అవగాహన ఉందన్నారు. అప్పటి పరిస్థితి వేరు.. ప్రస్తుత పరిస్థితులు వేరని ఆయన అన్నారు. కరోనా, ఒమిక్రాన్ మహమ్మారి కారణంగా రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిందని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల సమస్యలు, ప్రజలకిచ్చే సంక్షేమ పథకాలను సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని అంశాలపై చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. పీఆర్సీ ఆలస్యం అవుతుందని రూ.17వేల కోట్లు మధ్యంతర భృతి ఇచ్చామన్నారు. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా ఇదే తరహాలోనే హెచ్ఆర్ఏ ఇస్తున్నాయని సీఎస్ వెల్లడించారు. పీర్సీసీపై ఉద్యోగ సంఘాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మూడు పీఆర్సీ జీవోలపై ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.ఈ జీవోలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాయి. దీంతో ఏపీ సీఎస్ సమీర్ శర్మ వివరణ ఇచ్చారు.

ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు. కరోనా కారణంగా రాష్ట్రానికి ఆదాయం తగ్గిందని ఆయన చెప్పారు. గతంలో రాష్ట్ర ఆదాయం 98 వేల కోట్లుగా ఉండేదని, అదీ కరోనా కారణంగా 62 వేల కోట్లు పడిపోయిందన్నారు. ఆదాయాన్ని, ఖర్చులను బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఐఆర్ ఇచ్చామన్నారు. కరోనా థర్డ్ వేవ్ వల్ల మరింత నష్టం జరిగే అవకాశం ఉందని సీఎస్ సమీర్ శర్మ అభిప్రాయపడ్డారు. ఐఆర్ కంటే జీతంలో భాగం కాదన్నారు. పీఆర్సీ వల్ల గ్రాస్ శాలరీలో ఏ మాత్రం తగ్గదని సీఎస్ స్పష్టం చేశారు. హెచ్ఆర్ తగ్గందా? ;పెరిగిందా అనేది వేరే అంశమన్నారు. జీతాల్లో కోత మాత్రం పడే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. ఐఎఎస్‌లకు ఎక్కువ జీతాలు వస్తున్నాయనడం అవాస్తవమన్న సీఎస్.. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఆర్సీని ఫాలో అవుతున్నామన్నారు.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలనుపెంచుతున్నామన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచిన విషయాన్ని సీఎస్ గుర్తు చేశారు. పీఆర్సీలో ప్రతి అంశం సీఎం వైఎస్ జగన్‌కు తెలుసునని సీఎస్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా ఎక్కువని కానీ పన్నుల నుండి వచ్చే ఆదాయం తక్కువ అని సీఎస్ చెప్పారు. ఐఆర్ తో రాష్ట్ర ఖజానాపై రూ. 17 వేల కోట్ల భారం పడిందని సీఎస్ చెప్పారు.

పెన్షన్, గ్రాట్యుటీలో కూడా పెరుగుదల ఉంది. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో ద్రవ్యలోటు రూ.54,370 కోట్లుగా ఉంది. దేశంలో ఏ రాష్ట్రమూ ఉద్యోగ విరమణ వయస్సును పెంచలేదు. నియామకాలు ఉండవన్న ఆరోపణలు సరికావు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.5 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. అలాగే వైద్యారోగ్య శాఖలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చాం” అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తెలిపారు.

ఇదిలావుంటే ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ భేటీ తర్వాత హెచ్ఆర్ఏ విషయమై సీఎస్ నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు. అయితే, ఈ నెల 17వ తేదీ రాత్రి పీఆర్సీపై ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. 30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు.

Read Also….  AP Corona: ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన కరోనా కల్లోలం.. ఒక్కరోజే 10 వేలకుపైగా పాజిటివ్ కేసులు! 8మంది మృతి