Andhra News: అమరావతికే పట్టం.. చట్టబద్దతకు పక్కాగా అడుగులు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

ఔను.. అమరావతికే పట్టం. భవిష్యత్తులో కూడా దానికి తిరుగులేదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అందుకోసం పార్లమెంటులో చట్టం చేయిస్తామన్నారు. 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండడంతో గతంలో చట్టం కుదరలేదన్న సీఎం..ఇప్పుడా సమస్య లేదన్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో రాజధాని రైతులతో సమావేశమైన ముఖ్యమంత్రి.. పలు అంశాలపై వారికి క్లారిటీ ఇచ్చారు.

Andhra News: అమరావతికే పట్టం.. చట్టబద్దతకు పక్కాగా అడుగులు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
CM Chandrababu

Updated on: Apr 29, 2025 | 9:37 AM

అమరావతి విషయంలో గతంలో జరిగిన పొరపాట్లు రిపీట్‌ కాకూడదని  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసైడ్‌ అయ్యారు.. అందుకోసం పక్కాగా అడుగులు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం..అమరావతిని పక్కన పెట్టి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఉద్యమబాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల ఇకపై అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు స్పష్టం చేశారు.

అభివృద్ధి అవసరాల మేరకే తదుపరి భూ సమీకరణ

రాజధాని భూసమీకరణపై కూడా రైతుల అనుమానాలకు క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు. అమరావతి రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని.. అభివృద్ధి అవసరాల మేరకే తదుపరి భూ సమీకరణ ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం ఇస్తున్న కౌలుతో అవసరాలు తీరడం లేదని రైతులకు మరింత సాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

భవిష్యత్తు అవసరాలు దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు

రైతులతో భేటీలో అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా చంద్రబాబు చర్చించారు. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్ మహానగరం తరహాలో అమరావతి అభివృద్ధి చెందాలంటే నగరం విశాలంగా ఉండాలన్నారు. నగరానికి పెట్టుబడులు, అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటే కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. చంద్రబాబు వివరణతో సంతృప్తి చెందామంటున్నారు..రాజధాని రైతులు.

రాజధాని పనులపై ఓ వైపు భూములిచ్చిన రైతులకు భరోసా ఇస్తూనే మరోవైపు ప్రధాని మోదీ పర్యటనకు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ప్రధాని పర్యటనపై ఎన్డీఏ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మోదీ అమరావతి పర్యటన విజయవంతం చేద్దామని..రాజధాని పునర్నిర్మాణ పనులతో అభివృద్ధికి మళ్లీ ఊపిరి ఇద్దామని చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..