
గంజాయి స్మగ్లర్లు బరితెగిస్తున్నారు. పోలీసులు నిఘా పెంచినా.. ఎత్తులకు పైఎత్తులో వేస్తూ గంజాయిని సరిహద్దులు దాటించేస్తున్నారు. ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు నుంచి.. అల్లూరి అనకాపల్లి జిల్లాల మీదుగా.. ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. తమిళనాడు నుంచి.. విదేశాలకు కూడా తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు. జైల్లో కలిసి.. చేయి చేయి కలిపి.. గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న నిందితుల ముఠాను ఎట్టకేలకు అనకాపల్లి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. 1.15 కోట్ల విలువైన 230 కేజీల శీలావతి రకం గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అయిదుగురిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని తంజావూర్ జిల్లా రామనాథపురానికి చెందిన గంజాయి స్మగ్లర్ శశికుమార్.. అల్లూరి సీతారామరాజు జిల్లా అన్నవరం కాలనీకి చెందిన వంతల చంటిబాబు కేసుల్లో నిందితులుగా అరెస్టై తమిళనాడులోని పుదుక్కోట జైల్లో ఉన్నారు. అక్కడే వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. అక్కడ నుంచి ఏవోబిలో పండుతున్న మేలు రకం శీలావతి గంజాయి స్మగ్లింగ్ కు వ్యూహం రూపొందించుకున్నారు.
శశికుమార్ తమిళనాడుకు చెందిన ప్రధాన గంజాయి వ్యాపారి. ఏపీలోని ఏజెన్సీ, ఒడిశా ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి చెన్నై, కోయంబత్తూరు, తంజావూరులతో పాటు శ్రీలంకకు తరలించి.. చిన్న చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తూ భారీ లాభాలు గడించేవాడు. 2024లో పుదుక్కోట్టై జిల్లా జైలులో శశి కుమార్, చంటిబాబులకు పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చాక వీరిద్దరూ సంప్రదించుకున్నారు. పాంగి సుబ్బారావుతో కలిసి ఒడిశాలోని జంతాపాయి గ్రామంలో కిలో 5వేల చొప్పున 230 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. ఆ గంజాయిని జి.మాడుగుల మండలం అలగం గ్రామంలో దాచారు. అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలం బుర్రెల పణుకు గ్రామానికి చెందిన పాంగి సుబ్బారావు, తమిళనాడులోని వేలూరుకు చెందిన అమలరాజ్ , విల్లుపురం జిల్లా కిల్పత్తుపట్టుకు చెందిన మణికందన్ చంద్రకుమార్ తో కలిసి గంజాయి తరలించాలని ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాత అవకాశం సమయం చూసుకొని.. పుదుచ్చేరి రిజిస్ట్రేషన్ గల ఎర్టిగా కారులో వచ్చారు. గంజాయిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ క్రమంలో ఈనెల 19 తెల్లవారుజామున 10 ప్లాస్టిక్ గోనె సంచులలో నింపిన 230 కేజీల గంజాయిని ఎర్టిగా కారులో పెట్టుకుని బయలుదేరారు. పోలీసుల నిఘా తప్పించేందుకు ముందుగా రెండు మోటార్ సైకిళ్లతో పైలటింగ్ చేస్తూ వస్తున్నారు. అప్పటికే పక్కా సమాచారం పెట్టుకున్న పోలీసులు కాపు కాసారు.. గబ్బాడ గ్రామ శివార్లలో స్మగ్లర్లను పోలీసులు పట్టుకున్నారు. 1.33కోట్ల విలువైన 230 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. శశికుమార్… తమిళనాడుతో పాటు శ్రీలంకకు గంజాయి పొట్లాలు తీసుకెళ్లి విక్రయిస్తుంటాడని డీఎస్పీ శ్రీనివాసరావు వివరించారు. ముఠాను పట్టుకున్న నర్సీపట్నం సీఐ రేవతమ్మతోపాటు ఆమె సిబ్బందిని ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు.