రోహిణీ కార్తె వచ్చింది అంటే ఎండలకు రోళ్లు పగులుతాయి అంటారు. అటువంటి రోహిణీ కార్తె మొదలైంది. అయితే రోహిణీ కార్తెకు ముందుగానే వారం రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఉమ్‌పన్ తుపాను కారణంగా సముద్రం నుంచి వచ్చే వేడి గాలులకు ఉష్ణోగ్రతలు తోడై జనాలను మాడ్చేసే ఎండలు కాస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.
ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడు భగభగ మండుతూ తన ప్రచండ రూపం ప్రదర్శిస్తున్నాడు. గతంలో మే నెలలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా నమోదవుతున్నాయి. భానుడి భగభగలతో రోహిణీ కార్తె సోమవారం నుంచి ప్రారంభమైంది. నాలుగు మాసాల ఎండాకాలంలో రోహిణీ కార్తె సమయంలో సూర్యుడు భూమికి అత్యంత దగ్గరకు వస్తాడు. దాదాపుగా రెండు వారాల పాటు రోహిణీ కార్తె కొనసాగుతుంది. సూర్యుని తీవ్రమైన కిరణాలు భూమిని తాకిన కొద్దిరోజుల వ్యవధిలోనే వాతావరణంలో మార్పులు కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మంగళవారం(మే 26) నుంచి మూడు రోజుల పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, జూన్ మొదటి వారంలో వర్షాలు పడే అవకాశం ఉందని, కూడా అధికారులు చెబుతున్నారు. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వడగాడ్పుల ముప్పు పొంచి ఉందని, రాత్రి ఉష్ణోగ్రతలు అవకాశం పెరిగే ఉందని చెప్పారు. తెలంగాణలో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మే నెల మొదటి నుంచి దంచికొడుతున్న ఎండ ప్రతాపం చూపిస్తోంది. శనివారం ఆదిలాబాద్ లో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న నాలుగు రోజులు ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని, దీంతో ఉష్ణోగ్రత 47 డిగ్రీలు, ఆపైన నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈనెల 28 వరకు వడగాల్పుల తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉత్తర, తూర్పు తెలంగాణలో 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీలు.. పశ్చిమ, దక్షిణ తెలంగాణలో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రిలో 46 డిగ్రీలు, మహబూబ్ నగర్ లో 44.7 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లాలో 44.1 డిగ్రీలు, నల్లగొండ 44 డిగ్రీలు, హైదరాబాద్ లో 43.2 డిగ్రీలు, మెదక్ లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇక, అటు ఏపీలోనూ సూర్యుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం,కర్నూలు జిల్లాల్లో సూర్యుని భగభగలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ నెల 28వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని, 29 తర్వాత ఏపీలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. జూన్ మొదటి వారంలో రుతుపవనాల రాక ప్రారంభమయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. విపత్తుల నిర్వహణశాఖ జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిందని, ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వడగాడ్పులు వీస్తున్నందున పిల్లలు, వృధ్దులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని. ఓఆర్‌ఎస్, ఇంటిలో తయారు చేసిన నిమ్మకాయ నీరు, మజ్జిగ తరుచుగా తీసుకోవాలని సూచించారు.
ఈ వేసవి తాపం నుంచి రక్షించుకోవడానికి ఈ జాగ్రత్తలు పాటించండి:
*ఉప్పు కలిపిన నీరు, గ్లూకోజ్ తాగాలి
* రోజూ పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగా తాగాలి
* శరీరం డీహైడ్రేట్ కాకుండా ఓఆర్ఎస్ తీసుకోవాలి
* భయటకు వెళ్లేముందు ఒక గ్లాస్ నీరు తాగాలి
* ఎండలో బయటి నుంచి వచ్చిన వెంటనే చల్లని నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, చల్లని నీరు తాగాలి.
* తీపి పదార్థాలు, తేనె మాత్రం తీసుకోకూడదు