మరికొన్ని గంటల్లో రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న వైసీసీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. అంతలోపే తన టీమ్‌ను రెడీ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు ఐపీఎస్, ఐఏఎస్‌లను ఏపీకి బదిలీ చేయించుకున్న జగన్.. తాజాగా రాష్ట్ర అడ్వకేట్ జనరల్, అదనపు అడ్వకేట్ జనరల్‌లుగా సుబ్రమణ్యం శ్రీరామ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం పూర్తైన వెంటనే వీరి నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం.
అయితే ఏ రాష్ట్రంలోనైనా కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు.. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ న్యాయవాదులు, సహాయ ప్రభుత్వ న్యాయవాదులు, వివిధ కార్పొరేషన్లకు స్టాండింగ్ కౌన్సిళ్లుగా వ్యవహరిస్తున్న న్యాయవాదులు తమ తమ పోస్టులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. వీరి స్థానంలో కొత్త అడ్వొకేట్ జనరల్ అవసరాన్ని బట్టి ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదులను నియమించుకుంటారు. కాగా తెలంగాణ నుంచి పోలీసు ఉన్నతాధికారి స్టీఫెన్ రవీంద్రను సైతం జగన్ ఏపీకి బదిలీ చేయించుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే.