ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం కోసం ‘రుషికొండ’ బీచ్‌ పోటీ

|

Sep 27, 2020 | 12:03 PM

విశాఖ సాగర తీర౦ ప్రపంచ పట౦లో ప్రత్యేక స్థానం కోసం పోటీ పడుతోంది. రుషికొండ బీచ్ ప్రతిష్టాత్మకమైన బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేట్ గుర్తింపు కోసం సన్నద్ధమవుతోంది.

ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం కోసం ‘రుషికొండ’ బీచ్‌ పోటీ
Follow us on

విశాఖ సాగర తీర౦ ప్రపంచ పట౦లో ప్రత్యేక స్థానం కోసం పోటీ పడుతోంది. రుషికొండ బీచ్ ప్రతిష్టాత్మకమైన బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేట్ గుర్తింపు కోసం సన్నద్ధమవుతోంది. ప్రపంచ స్థాయిలో అరుదైన గౌరవాన్ని, గుర్తింపుని ఇచ్చే బ్లూఫాగ్ సర్టిఫికేట్ రుషికొండ బీచ్‌ సొంతమైతే విదేశీ టూరిస్టులను ఆకర్షించడ౦లో స౦దేహ౦ ఉ౦డద౦టున్నారు టూరిజం అధికారులు.

విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా బీచ్‌లను స్వచ్ఛంగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్‌ కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టు పేరుతో ప్రపంచ బ్యాంకు నిధుల సహాయంతో దేశంలోని కొన్ని బీచ్‌ల అభివృద్ధికి నాంది పలికింది. ఎంపిక చేసిన బీచ్‌లను ‘బ్లూఫ్లాగ్‌ తీర ప్రాంతాలు’గా మార్చేందుకు నడుంబిగించింది..దేశ వ్యాప్తంగా 13 బీచ్ లను సిద్ధం చేయగా దేశీయంగా పరిశీలించిన కమిటి వాటిలో ఎనిమిది బీచ్ లను ఎ౦పిక చేసి౦ది. అందులో ఆ౦ధ్రప్రదేశ్ నుండి ఒక్క రుషి కొండ బీచ్ మాత్రమే స్థానం పొందింది. అక్టోబర్ లో జ్యూరీ కమిటి వీటిని పరిశీలించి చివరగా బ్లూఫ్లాగ్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు వేటికి అర్హత ఉందో వేటికి లేదో తేల్చను౦ది.

ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ అనే సంస్థ బ్లూఫ్లాగ్‌ గుర్తింపునిస్తుంది. ఇది డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హెగెన్‌లో ఉంది. బ్లూఫ్లాగ్‌ రావాలంటే 33 రకాల నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. దీని కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ సంస్థ నిపుణులు వచ్చి తనిఖీ చేసి నిబంధనల మేరకు ఉంటే నీలిరంగు జెండా ను బీచ్‌లో ఏర్పాటు చేస్తారు. ఏ బీచ్‌కైనా బ్లూప్లాగ్‌ గుర్తింపు ఉంటే విదేశీ పర్యాటకులు ఆ ప్రాంతాలను సందర్శించేందుకు మక్కువ చూపుతారు. ఈ గుర్తింపు లభించిందంటే ఆ తీర ప్రాంతం ఆరోగ్యకరమైనదిగా లెక్క. బ్లూఫ్లాగ్‌ గుర్తింపు తీసుకురావడం కోసం దేశంలోని 8 బీచ్‌లను ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేస్తున్నారు. రుషికొ౦డ బీచ్ లో ప్రస్తుతం రూ.7.3 కోట్లతో పనులు జరుగుతున్నాయి. పర్యాటకులను ఆకట్టుకునేలా తీరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. 25 మందికిపైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బీచ్‌లో ఆరుబయట వ్యాయామశాల, పిల్లల కోసం క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు. వెదురుతో పలు నిర్మాణాలు చేపడుతున్నారు. సౌర విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ప్రతి నేల బీచ్ వాటర్ ను పరీక్షలు చేస్తున్నారు…దీనికి కోసం ఓ ప్రత్యేక ప్రణాళిక రుపోందించుకోని పని చేస్తున్నారు. ఈ సారి తప్పక రుషికొండ బీచ్‌లో బ్లూఫ్లాగ్ ఎగరవేస్తామని అధికారులు చెబుతున్నారు.