అభివృద్ధి కార్యక్రమాల పేరుతో వైసీపీ నేతలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. దీనిపై సీఎం జగన్ స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని జగన్‌కు లేఖ రాశారు. ప్రకాశం జిల్లా టంగుటూరులో కొంతమంది వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన లేఖలో విరించారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి రూ. 25 లక్షలు వసూలు చేసి.. వాటర్ ట్యాంక్ నిర్మించారు. అయితే వాటర్ ట్యాంక్ నిర్మాణానికి కొనుగోలు చేసిన స్థలంలో కొంతభాగాన్ని వైసీపీ నేతలు కబ్జా చేసి.. ప్రైవేట్ వాటర్ ప్లాంట్ నిర్మిస్తున్నారని కన్నా ఆరోపించారు. వారిని నిలదీయడానికి వచ్చిన గ్రామస్థులను బెదిరిస్తున్నారని అన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. ఎలాంటి ఫలితం రాలేదని సీఎం అయిన మీ దృష్టికి తీసుకొస్తున్నామని కన్నా చెప్పారు. అక్రమ నిర్మాణాలను తొలగించేలా చర్యలు తీసుకుని.. గ్రామస్థులకు న్యాయం చేయాలని కన్నా లేఖలో పేర్కొన్నారు.