ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో సుమారు గంటపాటు ఆయనతో చర్చలు జరిపారు శ్రీలక్ష్మి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తోన్న శ్రీలక్ష్మి.. డిప్యూటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఏపీ ప్రభుత్వంలో శ్రీలక్ష్మికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో డిప్యుటేషన్‌పై పనిచేయడానికి అనుమతించాలని కోరుతూ ఆమె ఇప్పటికే కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖకు, తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. ఏపీకి చెందిన శ్రీలక్ష్మి 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. రాష్ట్ర విభజన సమయంలో ఆమెను తెలంగాణకు కేటాయించగా.. ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు.