సాగు, త్రాగు నీరు విషయంలో ఆంధ్రప్రదేశ్‌కి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న పోలవరం నిర్మాణంపై కేంద్రం తీపి కబురు అందించింది. మరో రెండేళ్ల పాటు ప్రాజెక్ట్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా.. స్టాప్‌వర్క్ ఆర్డర్‌ను రెండేళ్ల పాటు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ భారంతో పాటు సవరించిన అంచనాలను సైతం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. పోలవరాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. స్టాప్‌వర్క్ ఆర్డర్‌ను పూర్తిగా రద్దు చేయాలని చూశామని, కానీ కొన్ని న్యాయపరమైన సమస్యలు ఉండడం వలన అది సాధ్యం కాలేదన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం.. పోలవరం పూర్తి చేయడానికి మరో రెండేళ్లు సమయం ఇచ్చినట్టు అవుతుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరితగతిన పనులు పూర్తిచేయాలని భావిస్తోంది.