వైసీపీ సీనియర్ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి సీఎం జగన్ మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. టీటీడీ పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఏడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తే.. ఏపీ నుంచి ఒక్క భూమనకు మాత్రమే అవకాశం కల్పించారు. ఆయనతో పాటు ఢిల్లీ నుంచి బీజేపీ ఎంపీ రాకేష్ సిన్హా, చెన్నైకు చెందిన శేఖర్, బెంగళూరు నుంచి కుపేందర్ రెడ్డి, హైదరాబాద్ నుంచి గోవింద హరి, భువనేశ్వర్ నుంచి దుష్మంత్ కుమార్ దాస్, ముంబై నుంచి అమోల్ కాలేలను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. ఈ ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులుగా టీటీడీ బోర్డు సమావేశాలకు హాజరుకానున్నారు. బోర్డు సభ్యులతో సమానంగా వారికి ప్రోటోకాల్ ఉంటుంది. అయితే టీటీడీ పాలకమండలి తీర్మానాల విషయంలో వారికి ఎలాంటి ఓటు హక్కులు ఉండవని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా వైఎస్ రాజశేఖర్‌కు మంచి సన్నిహితుడైన భూమన ఆయన హయాంలో టీటీడీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. ఇక ఆ తరువాత వైసీపీలో చేరిన భూమన.. ఆ పార్టీలోని సీనియర్ నేతలలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.