Anandayya Eye Drops : కంటిలో వేసే ఆనందయ్య చుక్కల మందు పంపిణీ నిలుపుదలకు సంబంధించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరుగనుంది. తాజాగా ఆనందయ్య ఇస్తోన్న కరోనా మందుకు జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐ డ్రాప్స్ మినహా మిగతా మందుల పంపిణీకి సర్కారు పచ్చజెండా ఊపింది. కాగా, ఇవాళ ఐ డ్రాప్స్ పంపిణీపై విచారణ జరపనుంది హైకోర్టు. మొత్తం 4 పిటిషన్లపై విచారణ చేయనుంది. ఇక, ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆనందయ్య మందులో ఆయన ఉపయోగిస్తున్న మూలికలు, పదార్థాలు ఏవీ హానికరం కాదని నిర్దారించారు. కంటిలో వేసే మందు మినహా మిగిలిన మందులు రోగులకు అందివచ్చని షరతు పెట్టారు, దీంతో వాటి తయారీకి ఆనందయ్య సిద్ధం అవుతున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి కరోనా నివారణకు ఆనందయ్య ఇచ్చే మందులు అందుబాటులోకి రానున్నాయి.
ఇలా ఉండగా, ఆనందయ్య మందుకోసం దళారులను నమ్మి మోసపోకండని వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి చెప్పారు. ఆనందయ్య ఆయుర్వేద మందుకు దళారులుగా వ్యవహరించి, సొమ్ము చేసుకోవాలని ఆలోచన చేస్తే, ఎంతటి వారికైనా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆనందయ్య ఆయుర్వేద మందు తయారీ, పంపిణీ విషయంలో పూర్తి నిర్ణయాధికారం ఆనందయ్యదే తప్ప, ప్రభుత్వానికి గానీ, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి గానీ ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. వస్తు రూపంలో ఇవ్వడం కానీ, ఆర్థిక సహాయం అందించాలన్న వారు గానీ వారు నేరుగా ఆనందయ్యకు తప్ప, మధ్యలో మరెవ్వరికీ, ఎంతటివారినైనా నమ్మి ఇవ్వవద్దని మనవి చేస్తున్నానని కాకాని తెలిపారు.
కాగా, ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన నేపథ్యంలో నెల్లూరుజిల్లా కృష్ణపట్నంలో కరోనా నివారణ ఔషద తయారీకి ఏర్పాట్లను నిన్నటి నుంచి మొదలు పెట్టారు. జిల్లా అధికారుల సూచనల మేరకు కృష్ణపట్నం పోర్టులోని సెక్యూరిటీ అకాడమీ ప్రాంగణంలో ఔషదం తయారీకి ఏర్పాట్లు చేసుకున్నారు ఆనందయ్య. అకాడమీ ప్రాంగణంలో మందు తయారీ కోసం ప్రత్యేకంగా తాత్కాలిక షెడ్ ను నిర్మిస్తున్నారు.