మన్యం వీరుడు అల్లూరిది ఏపీలో ఏ ఊరో తెలుసా..? ఆయన పోరాటం ఎలా సాగిందంటే..?

వందేళ్ల క్రితం బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించిన అల్లూరి సీతారామరాజు, గిరిజనులను సమీకరించి సాయుధ పోరాటం సాగించారు. 27 ఏళ్లకే అమరుడైన ఈ మన్యం వీరుడి జీవితం, ఉద్యమ ప్రస్థానం, ఆయన వారసత్వాన్ని ఈ కథనం వివరిస్తుంది. ఆయన స్మారక ప్రాంతాల ప్రస్తుత స్థితిని కూడా ఇది తెలియజేస్తుంది.

మన్యం వీరుడు అల్లూరిది ఏపీలో ఏ ఊరో తెలుసా..? ఆయన పోరాటం ఎలా సాగిందంటే..?
Alluri Sitarama Raju

Updated on: Aug 11, 2026 | 11:34 AM

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా డెల్టా ప్రాంతం నుంచి తూర్పు కనుమల వరకు అనేక చోట్ల అల్లూరి సీతారామరాజు ఉద్యమ ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. వందేళ్ల క్రితం గిరిజనులను సమీకరించి, బ్రిటిష్ వారిపై సాయుధ తిరుగుబాటు చేసిన తెలుగు బిడ్డగా ఆయనకు విశేష గుర్తింపు ఉంది. 1897లో విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో జన్మించిన అల్లూరి, 1924లో కేవలం 27 ఏళ్ల వయసులోనే అమరుడయ్యారు. అల్లూరి బాల్యం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకోడేరు మండలం మోగల్లులో గడిచింది. ఆయన సొంత ఇల్లు శిథిలం కావడంతో, ఆ ప్రాంతంలో స్మారక భవనం నిర్మించేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. ప్రాథమిక విద్యాభ్యాసం రాజమహేంద్రవరంలో సాగగా, ఆపై కాకినాడ, విశాఖపట్నం, నరసాపురం, తుని వంటి ప్రాంతాల్లో ఉన్నత చదువులు అభ్యసించారు. చదువులు పూర్తయిన తర్వాత రెండేళ్ల పాటు ఉత్తరాదిలో పర్యటించి, దేశంలోని పరిస్థితులను అధ్యయనం చేశారు. తిరిగి వచ్చిన అనంతరం, 1917 నుంచి తన జీవితాన్ని పూర్తిగా గిరిజనుల పక్షాన పోరాడేందుకే అంకితం చేశారు. 20 ఏళ్లు నిండకుండానే అడవిబాట పట్టిన అల్లూరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల పరిధిలో గిరిజనులపై బ్రిటిష్ అధికారుల దౌర్జన్యాలను స్వయంగా గమనించారు. సామాన్య గిరిజనులను చిత్రహింసలు పెడుతున్న కాంట్రాక్టర్లు, వడ్డీ వ్యాపారుల ధోరణిని చూసి విసుగు చెంది, ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 1917లో మన్యంలో అడుగుపెట్టిన అల్లూరి సీతారామరాజు, సుమారు ఐదేళ్ల పాటు గిరిజనుల సమస్యలను లోతుగా పరిశీలించారు. వారిని సంఘటితం చేసేందుకు కృషి చేశారు. గిరిజనులందరినీ ఐక్యం చేసిన తర్వాత, 1922 నుంచి చివరి మూడేళ్ల కాలం ఆయన సాయుధ పోరాటానికి దిగారు. ఈ క్రమంలోనే ఆయుధాల కోసం ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన అనేక పోలీస్ స్టేషన్లపై దాడులకు పాల్పడ్డారు. తొలుత చింతపల్లిలో ప్రారంభించి, ఆ తర్వాత కేడీ పేట, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లపై 1922 ఆగస్టులో వరుసగా మూడు రోజుల పాటు దాడులు చేసి, అక్కడి ఆయుధాలను తమ పోరాటానికి ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత మూడు నెలల విరామంతో మళ్ళీ 1922 అక్టోబరులో అడ్డతీగల, రంపచోడవరం, అన్నవరం పోలీస్ స్టేషన్లపై దాడులకు దిగారు. అయితే, అడ్డతీగల పోలీస్ స్టేషన్‌పై దాడి చేస్తున్న సమయంలో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. అల్లూరి సీతారామరాజుకు ఆయుధాలు దొరక్కుండా చేయడానికి ఒక వ్యూహాన్ని రచించి, పోలీస్ స్టేషన్ పరిధిలోనే గుంత తవ్వి, ఆయుధాలన్నిటినీ భూగర్భంలో దాచారు. దీంతో ఆ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన అల్లూరి బృందానికి ఎటువంటి ఆయుధాలు లభించక నిరాశతో వెనుదిరగాల్సి వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు.

వరుసగా మూడేళ్ల పాటు సాయుధ పోరాటానికి పూనుకున్న అల్లూరిని కట్టడి చేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం మొదట మలబారు సైన్యాన్ని, ఆ తర్వాత అస్సాం రైఫిల్స్ అధికారులను రంగంలోకి దింపింది. 1924, మే 7వ తేదీన, అప్పటికే మూడేళ్లుగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ సమరం సాగిస్తున్న అల్లూరి సీతారామరాజు, మే 1వ తేదీ నుంచి ఆరు రోజులపాటు కొండపల్లిలో బ్రిటిష్ సైన్యాలతో నేరుగా యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో గాయపడిన అల్లూరి, గాయాలను శుభ్రం చేసుకుని చికిత్సకు సిద్ధమవుతుండగా, రహస్య సమాచారం అందుకున్న అస్సాం రైఫిల్స్‌కు చెందిన మేజర్ గుడాల్ సారథ్యంలోని బ్రిటిష్ సైన్యాలు ఆయన్ని చుట్టుముట్టాయి. ప్రస్తుతం కొయ్యూరు మండలం మంప ప్రాంతంలో వాగులో ఉన్న అల్లూరిని పట్టుకుని, అక్కడి నుంచి కొయ్యూరు గ్రామానికి ఆనుకుని ఉన్న రాజేంద్రపాలానికి తరలించారు. రికార్డుల ప్రకారం, ఆయన మళ్ళీ తప్పించుకుంటారనే భయంతో రాజేంద్రపాలంలో ఒక చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు. అప్పటి నుంచి అల్లూరి సీతారామరాజు స్మారక కేంద్రంగా ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేసే ప్రయత్నాలు సాగిస్తోంది. కృష్ణదేవిపేటలో ఆయన సమాధి నిర్మించి, ఒక ఉద్యానవనంగా తీర్చిదిద్ది సందర్శనీయ ప్రాంతంగా మార్చారు. 1924 మే 7 తర్వాత ఇప్పటి వరకు కూడా అల్లూరిని తెలుగు ప్రజలు నిత్యం స్మరించుకుంటూనే ఉన్నారు.

అయితే, చిరస్మరణీయమైన అల్లూరి స్మారక కేంద్రాల నిర్వహణ విషయంలో ప్రభుత్వాల అశ్రద్ధ స్థానికులకు ఆవేదన కలిగిస్తోంది. ఆయన జన్మించిన గ్రామంలోనూ, ఇతర స్మారక ప్రదేశాలలోనూ అభివృద్ధి పనులు మందకొడిగా సాగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. పార్లమెంట్‌లో అల్లూరి విగ్రహం ఏర్పాటుకు అనుమతులు లభించినా, అది సాకారం కాకపోవడం పట్ల వారు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us